అటవీ అధికారుల అదుపులో 20 మంది తమిళ కూలీలు

25 Oct, 2016 23:52 IST|Sakshi

మైదుకూరు(చాపాడు): మైదుకూరు మండలం జాండ్లవరం వద్ద గల లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడు ప్రాంతానికి చెందిన ఎర్రచందనం కూలీలను మంగళవారం రాత్రి ఫారెస్ట్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.  గత కొన్ని రోజులుగా లంకమల అడవుల్లో ఎర్రచందనం నరుకుతూ ఉన్న తమిళ కూలీలు మంగళవారం జాండ్లవరం గ్రామానికి చెందిన బడా స్మగ్లర్, అధికార పార్టీ నాయకుడిని సంప్రదించేందుకు వస్తుండగా బీట్‌లో ఉన్న ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది గమనించి వారిని వెంటాడి పట్టుకున్నట్లు తెలిసింది. తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకుడైన బడా స్మగ్లర్‌ వారిని విడిపించేందు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో తాను అధికార పార్టీ అండ ఉన్న వ్యక్తినని, నియోజకవర్గంలో కీలకమైన నాయకుడినని, కూలీలను వదలకపోతే మీ కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఓ ఫారెస్ట్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. కాగా, జాండ్లవరం పరిధిలో తమిళ కూలీలు పట్టుబడగా.. ఫారెస్ట్‌ అధికారులు మాత్రం అక్కడ కాదని, ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాలు వద్ద తమిళ కూలీలు దొరికారని చెబుతున్నారు. జాండ్లవరం వద్ద దొరికినట్లు చెబితే ఆ ప్రాంతానికి చెందిన బడా డాన్‌తో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఫారెస్ట్‌ సిబ్బంది ఇలా మాట మారుస్తున్నారని, జాండ్లవరం ప్రాంతానికి చెందిన వారు చర్చించుకుంటున్నారు.
20 మంది తమిళ కూలీలు దొరికారుః డీఎఫ్‌ఓ శివశంకర్‌
    లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను పట్టుకున్నాము. వీరందరూ ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాల వద్ద అడవిలో నుంచి బయటకి వస్తుండగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు, అని డీఎఫ్‌ఓ శివశంకర్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు