బెజవాడలో నేరచరిత్ర మారాలి: సవాంగ్

26 Dec, 2015 14:01 IST|Sakshi
బెజవాడలో నేరచరిత్ర మారాలి: సవాంగ్

ఇప్పటి వరకూ 600 కు పైగా కాల్ మనీ ఫిర్యాదులు అందాయని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన శనివారమిక్కడ వివరించారు. ఈ వ్యవహారంలో వ్యాపారుల ఆర్థిక మూలాలపై ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి దర్యాప్తు చేస్తామని సీపీ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ తరహా నేరగాళ్లపై చర్యలు సాధ్యమని అన్నారు.

కాగా..విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా విజయవాడపై మరింత నిఘా ఉంటుందని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. బెజవాడలో నేర చరిత్ర మారాలని ఆయన అన్నారు. నేరాలను నివారించేందుకు టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు. మరో వైపు.. గుడివాడలో కాల్ మనీ వ్యాపారి కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. 59 పాస్ బుక్కులు, 83 ఏటీఎం కార్డులు, 6 స్టాంపు పేపర్లు సీజ్ చేశారు. రైల్వే ఉద్యోగులకు అప్పులు ఇచ్చిన సుబ్బారెడ్డి.. వారికి ఫోన్ చేసి వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు