ఆళ్లపల్లి ఆశలు సాకారం

6 Oct, 2016 23:11 IST|Sakshi
 •  - మండల కేంద్రంగా ఆవిర్భవించనున్న గ్రామం
 • - తీరనున్న మూడు దశాబ్దాల కష్టాలు
 • - ప్రారంభానికి సిద్ధంగా ప్రభుత్వ భవనాలు
 • - కిన్నెరసాని ఆవల గ్రామాలతో మండలం
 • ఆళ్లపల్లి మండల స్వరూపం
 • రెవెన్యూ గ్రామాలు: 8
 • గ్రామాలు: 45
 • జనాభా: 13,201
 • ఓటర్లు: 7,050
 • జిల్లా కేంద్రం నుంచి దూరం: 40 కి.మీ
 • గుండాల: నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో భాగంగా గుండాల మండలంలోని కిన్నెరసాని నదికి ఆవల ఉన్న మూడు పంచాయతీల్లోని గ్రామాలను కలుపుకుని ఆళ్లపల్లి మండల కేంద్రంగా ఆవిర్భవించనుంది. 30 ఏళ్లుగా ఆయా పంచాయతీ ప్రజలు పడుతున్న కష్టాలు తీరనున్నాయి. గుండాల మండలంలో ఆరు పంచాయతీలు ఉండగా ఆళ్లపల్లి, మర్కోడు, అనంతోగు పంచాయతీలను కిన్నెరసాని వేరుచేస్తుంది. అటుగా ఉన్న 45 గ్రామాల ప్రజలు ప్రతి ఏటా వాగులూ వంకలపై ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించేవారు. ఆళ్లపల్లిని మండలకేంద్రం చేయాలని ఇప్పటికే రెండు సార్లు ప్రతిపాదనలు వచ్చినా.. ఆ కల ఫలించలేదు. ప్రభుత్వం జిల్లాలు, మండలాల విభజన ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తూ.. విజ్ఞప్తులు ఇస్తూ వచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పినపాక, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావులు చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో నూతన మండలంగా ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం దృష్ట్యా పాలన సౌలభ్యం కోసం ఆళ్లపల్లిని నూతన మండలంగా ఎంపిక చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆళ్లపల్లికి 40 కి.మీ దూరంలో ఉండటంతో వేగంగా అభివృద్ధి చెందనుంది. ఆళ్లపల్లి మండల కేంద్రానికి సరిహద్దుగా పినపాక, మణుగూరు, గుండాల, టేకులపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు మండలాలు ఉన్నాయి.

  కిన్నెరసాని ఆవల..
  తెలంగాణ రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్దదిగా ఉన్న గుండాల మండలంలో ఆరు పంచాయతీలున్నాయి. 95 గ్రామాలున్నాయి. కిన్నెరసాని నదికి ఆవల 45 గ్రామాలు ఆళ్లపల్లి మండలంలోకి వెళ్తాయి. గుండాలలో మొత్తం 21 రెవెన్యూ గ్రామాలుండగా ఆళ్లపల్లిలో 8 రెవెన్యూ గ్రామాలున్నాయి. 13,201 జనాభా ఉండగా, 7,050 మంది ఓటర్లున్నారు. మూడు పంచాయతీలలో మూడువేల ఆవాసాలున్నాయి. సాచనపల్లి పంచాయతీలో అడవిరామారం మర్కోడుకు దగ్గరగా ఉండటంతో ఆ గ్రామాన్ని నూతన మండలంలో కలిపారు. ఇక కిన్నెరసాని నదికి ఆవల ఉన్న నాగారం, దొంగతోగు, జజ్జలబోడు, నడిమిగూడెం గ్రామాలు గుండాలకు దగ్గరగా ఉండటంతో వాటిని ఎందులో కలపాలనే ఆలోచనలో అధికారులు, ప్రజాప్రనిధులు ఉన్నారు. కిన్నెరసానికి ఇవతల ఉన్న నర్సాపురం, రాయిలంక, జిన్నెలగూడెం గ్రామాలు సైతం ఏ మండలంలో కలుపుతారనేది ప్రశ్నార్థకంగా ఉంది.

  • భవనాల ఎంపిక

  నూతన మండలంలో ప్రభుత్వ కార్యాలయాల కోసం అధికారులు నోటిఫికేషన్‌కు ముందే భవనాలను ఎంపిక చేశారు. పశుసంవర్థకశాఖ భవనాన్ని తహసీల్దార్‌ కార్యాలయంగా, పాత పీహెచ్‌సీ భవనంలో మండల పరిషత్‌, అంగన్‌వాడీ భవనంలో వ్యవసాయశాఖ, హైస్కూల్‌లో నూతనంగా నిర్మించే భవనంలో విద్యాశాఖ, ప్రాథమిక పాఠశాలలో ఐకేపీ, ఈజీఎస్‌ శాఖలను ఏర్పాటు చేయనున్నారు. పీహెచ్‌సీ, పోలీస్‌స్టేషన్‌లు గతం నుంచే ఉన్నాయి. ఇతర శాఖలు, నూతన భవనాల కోసం ప్రభుత్వ స్థలాలలను అధికారులు గుర్తిస్తున్నారు. నూతన మండలంలో రెండు ఆశ్రమ పాఠశాలలున్నాయి. సబ్‌స్టేషన్‌కు ఇటీవలే శంకుస్థాపన చేశారు. మండలంగా ఏర్పాటైతే గురుకులం, జూనియర్‌ కళాశాల, వసతి గృహాలు నిర్మించాల్సి ఉంది. రెండేళ్ల క్రితం ఆంధ్రాబ్యాకు ఏర్పాటు చేశారు. ఇలా అన్ని విధాలుగా వనరులు ఉండడంతో పాలన కూడా సులభతరం కానుంది.

  • జిల్లా కేంద్రానికి చేరువగా..

  నూతనంగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆళ్లపల్లి మండలం 40 కి.మీ దూరంలోనే ఉండటంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. గతంలోనే కొత్తగూడెం నుంచి మర్కోడు వరకు బీటీ రోడ్డు ఉంది. దీనిని ఆర్‌అండ్‌బీకి అప్పగించి, డబుల్‌ రోడ్డుకు ప్రణాళికలు పంపారు. ఆళ్లపల్లిలో రూ. 22 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, రూ. 11 కోట్లతో జల్లేరుపై ఎత్తిపోతల పథకం, రూ. కోటితో మర్కోడులో మార్కెటు యార్డు, రూ. 50లక్షలతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు జరుగుతున్నాయి. ఇటు మండల కేంద్రానికి లింకురోడ్లు నిర్మించే అవకాశాలున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఈ మండలంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడపాలని ఆయా ప్రాంత వాసులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు