తల్లి.. చెల్లిగా ఆశ వర్కర్ల సేవలు

29 Jul, 2016 00:40 IST|Sakshi
 ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
బిజినేపల్లి: మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గూడాలు, గిరిజన తండాల్లో ఆశ వర్కర్లు తల్లిగా, చెల్లిగా ఆరోగ్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్లస్టర్‌ స్థాయి ఆశ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అన్ని ఆరోగ్య సేవలను ప్రజల వద్దకు చేర్చడంలో ఆశ వర్కర్ల కృషి ఎంతో గొప్పదన్నారు. గర్భవతి నుంచి పుట్టిన బిడ్డ దాకా తల్లిగా, చెల్లిగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య సూత్రాలు సామాజిక ఆరోగ్య పౌష్టికాహార సలహాలు తెలియజేస్తున్నారని అన్నారు. ఆశ వర్కర్ల సమస్యలపై ఇదివరకే సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, రాబోయే రోజుల్లో వారికి మంచి పారితోషికం అందే విధంగా తెలంగాణ సర్కారు అండగా ఉంటుందన్నారు.  సమావేశంలో  క్షయ నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్‌ మల్లికార్జునప్ప, ఎస్పీహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, డాక్టర్లు సాయినాథ్‌రెడ్డి, సిరాజుద్దీన్, దశరథ్‌ ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎద్దుల రాములు, సర్పంచ్‌ సుమలత, ఎంపీటీసీ సరస్వతమ్మ, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు