అశ్వ వాహనంపై ఆదిదంపతులు

17 Jan, 2017 22:36 IST|Sakshi
అశ్వ వాహనంపై ఆదిదంపతులు
- అద్దాల మండపంలో ఏకాంత సేవ
 
శ్రీశైలం: సంక్రాంతి పర్వదినాన వధూవరులైన పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వార్ల ఏకాంత సేవను మంగళవారం రాత్రి అద్దాల మండపంలో ఆగమ సంప్రదాయానుసారం వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. పుష్పోత్సవ, శయనోత్సవ వేడుకలను కనుల పండువగా చేపట్టి ఏకాంత సేవకు సిద్ధం చేసిన అద్దాల మండపం తలుపులను మూసేశారు. అంతకు ముందు అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి వాహన పూజలు చేశారు. ఆ తర్వాత అశ్వ వాహనాధీశులైన ఆదిదంపతులను మూడుసార్లు ఆలయప్రదక్షిణ చేయించి యథాస్థానానికి చేర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద స్వామివార్ల పుష్పోత్సవ సేవకు పరిమళభరితమైన పుష్పాలతో మండపాన్ని సన్నద్ధం చేశారు.
 
          రాత్రి 9.30 గంటల తర్వాత స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్ఛారణ మధ్య, మంగళవాయిద్యాల నడుమ శయనోత్సవ సేవా కార్యక్రమం అద్దాల మండపంలో నిర్వహించారు. పరిమళ భరిత పుష్పాలైన పసుపు చేమంతి, తెల్లచేమంతి, కనకాంబరాలు, కాగడాలు, గులాబి, మందార, ఎర్రగన్నేరు, దేవగన్నేరు, ముద్ద గన్నేరు, ఆస్టర్, గ్లైలార్డియా, సువర్ణ గన్నేరు, గ్లాడియోలస్‌ తదితర పుష్పాలు, ఫలాలను ఏకాంత సేవకు సిద్ధం చేశారు. అలాగే స్వామివార్ల ఏకాంత సేవ కోసం అద్దాల మండపంలోని ఊయలతల్పాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శ్రీ పార్వతీ మల్లికార్జున స్వామివార్ల ఏకాంత సేవను ఆగమ సాంప్రదాయానుసారం వేదమంత్రోచ్ఛారణల మధ్య చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు