మంజీరమ్మకు మళ్లీ వరదలు

1 Oct, 2016 19:40 IST|Sakshi
జల దిగ్బంధంలో దుర్గమ్మ ఆలయం

జలదిగ్బంధంలో దుర్గమ్మతల్లి
పొంగిపొర్లుతున్న ఘనపురం

పాపన్నపేట: మంజీరమ్మకు మళ్లీ వరద పోటెత్తింది.  సింగూర్‌ నుంచి దిగువకు 1.20లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో శనివారం సాయంత్రానికి పాపన్నపేట మండలం ఏడుపాయల్లోని ఘనపురం ఆనకట్ట వరదనీటితో పొంగి పొర్లింది. పరవళ్లు తొక్కుతున్న మంజీర దిగువన ఉన్న దుర్గమ్మ తల్లిని దిగ్బంధించింది. దీంతో అమ్మవారి ఆలయానికి మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి.

వారం రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయానికి శుక్రవారం దారి ఏర్పడింది. వరదల ఫలితంగా సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఈఓ వెంకట కిషన్‌రావు తెలిపారు. ఆలయం చుట్టూ ఉన్న గ్రిల్లింగ్, హుండీలు, ఫ్యాన్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. అమ్మవారి ఆలయం ముందు వంతెన కూడా కుప్ప కూలింది.

శనివారం ఆలయ  పునరుద్ధరణ పనులు చేపడుతుండగా తిరిగి వరద నీరు చుట్టేసింది. ఎల్లాపూర్‌ వంతెనకు దాదాపు  సమాంతరంగా మంజీర ప్రవాహం కొనసాగుతుంది. వంతెన మునిగే అవకాశాలు తక్కువేనని ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య తెలిపారు. పాపన్నపేట మండలంలో నది వైపు వెళ్లొద్దని ఆయన సూచించారు.

రాజగోపురం చుట్టూ ఫెన్సింగ్‌
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏడుపాయలకు భక్తులు వస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మెదక్‌ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వరదనీటి వద్దకు ఎవరు వెళ్లకుండా రాజగోపురం వద్ద భారీ ఎత్తున ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు