వరద సాయంలో వివక్ష | Sakshi
Sakshi News home page

వరద సాయంలో వివక్ష

Published Sat, Oct 1 2016 7:39 PM

పరిహారం కోసం తహసీల్దారు కార్యాలయం ముందు బారులు తీరిన బాధితులు - Sakshi

* నీటమునిగి దెబ్బతిన్న ఇళ్లకు అందని పరిహారం
కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
అనర్హులకు అందుతున్న సాయం
 
దాచేపల్లి: వరద ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి పరిహారం అందటం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి నీళ్లు ఇళ్లలోకి చేరాయి. అయితే బాధితులు కాని వారికి ప్రభుత్వం సాయం అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వరద నష్ట పరిహారమిచ్చి ఆదుకోవాలని బాధితులు తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒకే వీధిలో నివసిస్తున్న వారిలో ఒక ఇంటికి పరిహారమిచ్చి మరో ఇంటిని వదిలేస్తున్నారు.
  
దెబ్బతిన్న ఇళ్లకు పరిహారమేదీ ?
గత వారంలో కురిసిన భారీ వర్షానికి దాచేపల్లిలోని కాటేరు వాగు పొంగి ప్రవహించటంతో వర్షపు నీరు స్థానిక ఎస్టీ, ఎస్సీ, వడ్డెర కాలనీలు, ముత్యాలంపాడు రోడ్డు, కొట్లా బజార్, పద్మాలయ స్టూడియో వీధి, శ్రీ వీర్ల అంకమ్మతల్లి దేవాలయం, చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంక్‌ వీధి,, దాచేపల్లి– కారంపూడి రోడ్డులను చుట్టు ముట్టాయి. ఈ వీధుల్లోని ఇళ్లలో ఐదు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించాయి. నీటి ప్రవహంలో ఇళ్లలోని సామగ్రి, నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి. వరద ప్రభావంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ధాటికి మండల వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి 1408 ఇళ్లలోకి నీరు చేరాయని, 331 ఇళ్లు పాక్షికంగా, 62 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అత్యధికంగా వరద నష్టం జరిగిన దాచేపల్లిలోనే బాధితులకు సక్రమంగా పరిహారం అందలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారి ఇళ్లను గుర్తించారని, నిజంగా దెబ్బతిన్న వారి ఇళ్లను గుర్తించలేదని బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులపాటు వర్షపు నీరు ఇళ్లలో ఉండటం వలన ఇళ్లు దెబ్బతిన్నాయని, కట్టుబట్టలతో బయటకు వచ్చిన వారికే సాయం అందించలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇంటింటికీ వచ్చి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.  
 
ఇంట్లో నడుము లోతులోనీళ్లు..
వరద నీళ్లు ఇంట్లోకి వచ్చాయి. రెండు రోజుల పాటు ఇంట్లో నీళ్లు నడుముల ఎత్తులో నిల బడ్డాయి. ఇంట్లోకి కూడా వెళ్లలేకపోయాం. వరద వలన ఇంటి గోడలు నానిపోయి కూలేందుకు సిద్ధం గా ఉన్నాయి. మాకు నష్ట పరిహారం అందించ లేదు. బాధితులు కాని వారికి సాయం అందిస్తున్నారు.
– రావూరి అన్నపూర్ణ, దాచేపల్లి
 
సాయం కోసం ప్రదక్షిణలు..
వరద వలన నష్టపోయిన ఇళ్లకు పరిహారమిస్తారని తెలిసి నాలుగు రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంటిని చూపించి రేషన్‌కార్డు చూసి సాయం చేయాలని కోరితే ఎవరు పట్టించుకోవటం లేదు. ఇళ్లు తడిసి ముద్దయితే బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు కూడా ఇవ్వలేదు.
– పరిమిశెట్టి పావని, దాచేపల్లి

Advertisement

తప్పక చదవండి

Advertisement