ఏం ఒరగబెట్టారని వస్తున్నారు బాబూ

4 Aug, 2016 21:50 IST|Sakshi
ఏం ఒరగబెట్టారని వస్తున్నారు బాబూ

-  నియోజకవర్గంలో సాగు, తాగు నీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం
వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి


అనంతపురం : శింగనమల నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారని ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈనెల 6న బుక్కరాయసముద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. రుణమాఫీ ఏ మేరకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. రుణమాఫీ చేసిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రూ. 2–3 వడ్డీకి తెచ్చుకుని బ్యాంకుల్లో రెన్యూవల్‌ చేసుకున్నారన్నారు.


కొత్త  అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంటల పెట్టుబడులకు ప్రైవేటుగా అప్పులు చేశారన్నారు. వీటిపై నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దని అన్నీ మాఫీ  చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ఓట్లేస్తే.. ఈరోజు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని మహిళలు వాపోతున్నారన్నారు. మోసపోయిన మహిళలకుS ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారు బయటకు రావాలంటూ బాబు అధికారంలోకి రావాలంటూ ప్రచారాలు చేశారని, ఈరోజు ఒక్క మహిళ బంగారు కూడా విడిపించలేదన్నారు. 


చివరకు బ్యాంకుల  నుంచి వేలం నోటీసులు వచ్చాయన్నారు. ఆ  మహిళలకు ఏం సమాధానం చెబుతారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, కానీ రెండేళ్లు దాటినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో వేలాదిమంది ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు.  వారికి  ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీటికితోడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ  సమస్య తీర్చలేని చంద్రబాబు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు.


ఆయకట్టుకు సంబంధించి రెండేళ్లుగా చుక్క నీరు రాకపోవడంతో రైతులు తమ భూములన్నీ బీళ్లు పెట్టారన్నారు.  వెనుకబడిన అనంత జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన రూ. 50 కోట్లు  ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ, జిల్లా ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ముఖ్యమత్రి  పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.  సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, పుట్లూరు మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి, జిల్లా  స్టీరింగ్‌ కమిటీ  సభ్యులు వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు