వీర్నపల్లిని సందర్శించిన అమెరికా బృందం

1 Sep, 2016 22:09 IST|Sakshi
వీర్నపల్లిని సందర్శించిన అమెరికా బృందం
  • అభివృద్ధి పనుల పరీశీలన
  • గిరిజనులతో కలిసి నృత్యాలు
  •  ఎల్లారెడ్డిపేట : కరీంనగర్‌ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్‌ సంసద్‌ ఆదర్శ గ్రామయోజన ద్వారా దత్తత తీసుకున్న వీర్నపల్లిని అమెరికా బృందం సభ్యులు గురువారం సందర్శించారు. యూఎస్‌ఏ స్మిత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెషనల్‌ మెంటోర్‌ డానియల్‌మర్గీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాయలగ్రేస్లీ, మికెలాజఫక్సన్‌ బృందం గ్రామంలో చేపట్టిన అభివృద్ధిపనులు, చెరువుల నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. మాడల్‌స్కూల్, గ్రామపంచాయతీ భవనం, అంగన్‌వాడీ, సాక్షరభారత్, మిషన్‌ కాకతీయ పథకంలో మరమ్మత్తు చేస్తున్న పులిచెరువుతో పాటు గ్రామీణ బ్యాంకును పరిశీలించారు. స్వచ్ఛ భారత్‌ ద్వారా అమలవుతున్న పారిశుధ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీర్నపల్లి అభివృద్ధిలో దేశంలోనే 11స్థానంలో రాణించడంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులను వారు అభినందించారు. గ్రామంలో భూగర ్భ జలాలను బృందం సభ్యులు పరిశీలించారు. భూగర్భ నీటిమట్టం పెంచడానికి అమెరికా కళాశాల 95శాతం నిధులు ఇస్తే, గ్రామపంచాయతీ 5శాతం నిధులు సమకూర్చాలన్నారు. గ్రౌండ్‌ వాటర్‌ పెంచే విధంగా అంతర్జాతీయ స్థాయిలో నిధులను కేటాయించే విధంగా గ్రామస్తులు సహకరించాలని సూచించారు. నీటిని ఎలా పొదుపు చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు. బృందం సభ్యులు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. మారుమూల పల్లెలో గిరిజన నృత్యాలు చూసిన బృందం సభ్యులు సెల్ఫీలు దిగారు.
    వీర్నపల్లిని స్ఫూర్తిగా తీసుకుంటాం
    ఆదర్శ గ్రామాల్లో దేశంలోనే 11వ స్థానంలో నిలిచిన వీర్నపల్లిని స్ఫూర్తిగా తీసుకుంటామని అమెరికా బృందం ప్రతినిధి డెనియల్‌ మర్ఫీ అన్నారు. గ్రామపంచాయతీలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని ఎంపీలు దత్తత తీసుకున్న ఆదర్శ గ్రామాల్లా పర్యటిస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్‌ నీతూప్రసాద్‌ సూచన మేరకు వీర్నపల్లికి వచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై నివేధికలను తమ సంస్థకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కుమారుడు ప్రణయ్, వాసన్‌ సంస్థ ప్రతినిధులు యుగేంధర్, మదన్‌మోహన్, గీతారెడ్డి, హాసిని, సిద్దార్థరాయ్, జెడ్పీ డెప్యూటీ సీఈవో గౌతంరెడ్డి, జెడ్పీటీసీ ఆగయ్య, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్‌ పవన్‌కుమార్, సర్పంచ్‌ సంజీవలక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మి,  గ్రామస్తులు పాల్గొన్నారు. 
     
     
మరిన్ని వార్తలు