‘అనంత’ పోరాటం మరువలేనిది!

6 Jan, 2017 00:08 IST|Sakshi
‘అనంత’ పోరాటం మరువలేనిది!

- ఆయన స్ఫూర్తితోనే సాగు, తాగునీటి ఉద్యమాలు
- అనంత వెంకటరెడ్డి వర్థంతిలో వక్తలు

అనంతపురం : అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించినప్పుడే అభివృద్ధి చెందుతుందని భావించి అనేక పోరాటాలు చేసిన వారిలో అనంత వెంకటరెడ్డి ముఖ్యుడని, ఆయన పోరాటాలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. అనంత వెంకటరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గురువారం వారు పెద్దాస్పత్రి ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అనంతవెంకటరెడ్డి తనయుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనిద్వారా మన జిల్లాలో 3.42 ఎకరాలకు, 387 చెరువులకు సాగునీరు అందుతుందన్నారు. ఈ దిశగా కృషి చేసిన అనంత వెంకటరెడ్డి పేరు ఈ పథకానికి పెట్టారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అనంత వెంకటరెడ్డి పేరును తొలిగించడమే కాకుండా 380 చెరువులను 1,260 చెరువులుగా చేస్తానని చెబుతూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు తిలోదకాలు ఇచ్చేందుకు పూనుకుందని మండిపడ్డారు. వైఎస్‌ పేరును శాశ్వతంగా కనుమరుగు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. అనంత లాంటి నాయకులæ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు.

- ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం చివరిదాకా పోరాటాలు చేసిన యోధుడు అనంత వెంకటరెడ్డి అన్నారు. కృష్ణాజలాలు అనంతకు మళ్లించేందుకు జరిగిన పోరాటంలో ఆయన చాలా కీలకపాత్ర పోషించారన్నారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ గొప్ప మనసుతో రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అంతకుముందు చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నా ఒక్క ప్రాజెక్టునూ పట్టించుకోలేదన్నారు. హంద్రీ - నీవా పథకానికి అనంత వెంకటరెడ్డి పేరు తొలిగించడం ప్రభుత్వ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు హంద్రీ - నీవా నీరు తెచ్చుకునేందుకు వెంకటరెడ్డి స్ఫూర్తితో పోరాడేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

- మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు ఈరోజు అనంతకు వచ్చాయంటే వెంకటరెడ్డి చలువేనన్నారు. ఆయన పోరాటాలు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆయన కృషి ఫలితంగానే హంద్రీ - నీవా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారన్నారు.
- పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు.
- కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాం«ధీ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాగేపరుశురాం, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నదీంఅహ్మద్, మీసాలరంగన్న, మహిళ,బీసీ,ట్రేడ్, ఎస్సీ విభాగాల జిల్లా అధ్యక్షులు బోయ సుశీలమ్మ, పామిడి వీరా, ఆదినారాయణరెడ్డి, పెన్నోబులేసు, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, అంబటి ఆదినారాయణరెడ్డి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా తదితరులు పాల్గొన్నారు.
- అంతకుముందు రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నగరంలోని అనంత వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పూర్తిగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటి కోసం ఆయన చేసిన ఉద్యమం మరువలేనిదన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు