లక్నో ఆసుపత్రిలో బెడ్స్‌ కొరత.. మాజీ ఎంపీ కుమారుడి కన్నుమూత

31 Oct, 2023 08:48 IST|Sakshi

లక్నో: వైద్య సదుపాయాల కొరతతో సాధారణ పౌరులకే కాదు ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు హాస్పిటల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మౌలిక సదుపాయలు లేమి కారణంగా మాజీ ఎంపీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్‌ అందుబాటులో లేక, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లోక్‌ సభ మాజీ ఎంపీ కుమారుడు మరణించాడు. లక్నోలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాలు.. బీజేపీ మాజీ ఎంపీ భైరోన్ ప్రసాద్‌ మిశ్రా కొడుకు ప్రకాష్‌ మిశ్రా(41) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం  రాత్రి 11 గంటలకు లక్నోలోని ఎస్‌పీజీఐ ఆసుప్రతి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.  అయితే చికిత్స పొదుంతూ ప్రకాశ్‌ మిశ్రా మృతిచెందారు.

కొడుకు మరణంతో కుంగిపోయిన ప్రసాద్‌ మిశ్రా.. ఆసుపత్రిపై   తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో సరిపడ బెడ్స్‌ లేకపోవడమే కొడుకు మరణానికి కారణమని ఆయన ఆరోపించారు. అత్యవసర వైద్యాధికారి సైతం రోగిని కాపాడేందుకు ప్రయత్నించకుండా అలాగే ఉండిపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాసేపటికి తన కుమారుడు మరణించాడని మాజీ ఎంపీ పేర్కొన్నారు.
చదవండి: అ‍ప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!

కొడుకు మృతదేహంతో ఆసుప్రతి ఎమర్జెన్సీవార్డు వెలువల మిశ్రా ఆందోళన చేపట్టారు. తన కొడుకు చావుకు కారణమైన డాక్టర్‌ను సస్పెండ్‌ చేసి తదుపరి విచారణ చేపట్టేవరకు తన నిరసన కొనసాగుతుందని తెలిపారు. ‘నేను నా కుమారుడిని కోల్పోయాను. ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా డ్యూటీ చేయడం లేదని నిరసనకు దిగాను. నేను నిరసన చేస్తున్నప్పుడు.. చాలా మంది వచ్చి, ఆ డాక్టర్​కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలి,’ అని ప్రసాద్​ మిశ్రా తెలిపారు.

దీనిపై స్పందింంచిన ఆసుపత్రి యాజమాన్యం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప ‍్రస్తుతం డాక్టర్‌ను సస్పెండ్‌ చేశామని ఆసుపత్రి చీఫ్‌ ఆరేకే ధీమాన్‌ తెలిపారు. కాగా కాగా మిశ్రా గతంలో బండా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.

ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎస్పీ పార్టీ నేత అఖిలేశ్​ యాదవ్​ విమర్శలు గుప్పించారు. ఇది ఆసుపత్రి వైఫల్యం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్​ వైఫల్యమని మండిపడ్డారు.. ఆసుపత్రులకు బడ్జెట్​ ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవైపు  ఉత్తర్​ ప్రదేశ్​ డిప్యూటీ సీఎం ప్రసాద్​ మౌర్య..  మిశ్రా ఇంటికి వెళ్లి, ఆయన్ని పరామర్శించారు.కమిటీ వేసినట్టు, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు