అన్నదాత ఆక్రందన

27 Mar, 2017 22:56 IST|Sakshi
అన్నదాత ఆక్రందన
ఆచంట: ఆచంట మండలంలోని ములపర్రు బ్రాంచి కెనాల్‌ పరిధిలోని శివారు భూములకు నీరందడం లేదని సోమవారం రైతులు రోడ్డెక్కారు. ఆచంటలో మార్టేరు-కోడేరు రహదారిపై టెంటు వేసి సుమారు మూడు గంటలపాటు బైఠాయించారు. సుమారు 300 ఎకరాలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, దీనిపై నీటిపారుదల అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పాలు పోసేకునే దశలో ఉందని, నీరందకపోతే నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వరి దుబ్బులతో నిరసన తెలిపారు. దీంతో మార్టేరు–కోడేరు రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
రైతులకు బాసటగా వైఎస్సార్‌ సీపీ నేతలు 
వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కవురు శ్రీనివాసు పార్టీ నాయకులతో కలిసి ఆందోళనకు మద్దతు తెలిపారు. రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వ్యవసాయన్ని నిర్వీర్యం చేసి భూములను పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేసే యోచనలో ఉందని శ్రీనివాస్‌ విమర్శించారు. ఆచంట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తీవ్రసాగు నీటి ఎద్దడి నెలకొందన్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, ఆచంట, పెనుమంట్ర మండల పార్టీ అధ్యక్షులు ముప్పాల వెంకటేశ్వరరావు, కర్రి వేణుబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్, ఎస్సీ సెల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర సీతారామ్‌ పాల్గొన్నారు.
ఏఈపై మండిపాటు
ఇరిగేషన్‌ ఏఈ ఎస్‌.శ్రీనివాసు, సిద్దాంతం వాటర్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ తమ్మినీడి ప్రసాదుతో కలిసి ఆందోళనకారుల వద్దకు వచ్చారు. రైతులంటే అంత అలుసుగా ఉందా? ములపర్రు బ్రాంచి కెనాల్‌ శివారు భూముల్లో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? నీరందడం లేదని చెబుతున్నా మీలో చలనం ఉండదా అంటూ రైతులు ఏఈపై మండిపడ్డారు. తక్షణమే సాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతు సంఘం నాయకులు తమ్మినీడి ఆదినారాయణ, కానుమిల్లి జోగిరాజు, నెక్కంటి సోమశేఖర్, సజ్జా రామారావు తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు.  
మరిన్ని వార్తలు