సత్యదేవుని జయంత్యుత్సవం ప్రారంభం

24 Jul, 2017 23:29 IST|Sakshi
సత్యదేవుని జయంత్యుత్సవం ప్రారంభం
-ఆయుష్య హోమానికి శ్రీకారం 
-నేడు, రేపు మూలవిరాట్‌కు అభిషేకాలు
అన్నవరం (ప్రత్తిపాడు):   శ్రీసత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలు( జయంత్యోత్సవాలు)  శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో అర్చకస్వాములు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పూజలను నిర్వహించే పండితులు, అర్చకస్వాములు, వంద మంది రుత్విక్కులకు దేవస్థానం ఛైర్మన్‌ ఐవీ రోహిత్, ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు వరుణలు, దీక్షావస్త్రాలను బహూకరించారు. మధ్యాహ్నం మండపారాధన, కలశస్థాపన, శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణ అర్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం  తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌గ్రేడ్‌ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దిన వేడుకల్లో భాగంగా సత్యదేవుని ఆయుష్యహోమానికి  పండితులు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మంత్రోచ్చరణల మధ్య కొయ్యల రాపిడితో  హోమాగ్నిని వెలిగించి గుండంలో వేసి హోమాన్ని ప్రారంభించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమం బుధవారం జరుగుతుంది.
మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్‌ లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు.  అనంతరం స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశాక దర్శనానికి  భక్తులను అనుమతిస్తారు. మఖ న క్షత్రం సందర్భంగా  బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు.  
మరిన్ని వార్తలు