హైదరాబాద్‌తో విడదీయరాని బంధం

28 Jul, 2015 02:12 IST|Sakshi
హైదరాబాద్‌తో విడదీయరాని బంధం

 నగరమంటే కలాంకు ఎంతో ఇష్టం
 ఆ మాట ఆత్మకథలోనూ రాసుకున్నారు
 శాస్త్రవేత్తగా ఇక్కడపలు కీలక పరిశోధనలు
 వందకు పైగా స్కూళ్లు, కాలేజీల్లో ప్రసంగాలు
 సెంట్రల్ వర్సిటీతోనూ ఎంతో అనుబంధం
 పిల్లలకు, యువతకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ ఎంతో అందమైన నగరం. నగరంలో రాక్ గార్టెన్స్ అద్భుతంగా ఉంటాయి. నగర శివార్లలో  కనిపించే గుట్టలు, కొండలు చూస్తుంటే కదలాలనిపించదు. ఒకదానిపైన ఒకటి ఎవరో పేర్చినట్టుండే రాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ నగరమంటే నాకెంతో ఇష్టం’’- హైదరాబాద్‌పై కలామ్‌కున్న ప్రేమ ఆయన నోట వచ్చిన ఈ వాక్యాల్లోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. నగరంతో ఆయనకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌తో తన బంధాన్ని తన జీవిత చరిత్రలోనూ ఆప్యాయంగా రాసుకున్నారాయన. శాస్త్రవేత్తగానే గాక పరిశోధకుడిగా, తత్వవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కలాం హైదరాబాద్ ప్రజల మనస్సు దోచుకున్నారు.
 
 సెంట్రల్ వర్సిటీకి చిరకాల నేస్తం
 
 హైదరాబాద్ డిఫెన్స్ లేబొరేటరీలో విధులు నిర్వహించే రోజుల్లోనే క్రమం తప్పకుండా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లేవారు. విద్యార్థులతో ఇష్టాగోష్ఠుల్లో ఎంతో ఇష్టంగా పాల్గొనేవారు. వారితో మమేకమయ్యేవారు. అప్పటి వైస్ చాన్సలర్ పల్లె రామారావు, కలాం గొప్ప స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘కలాం రావూస్’ స్కూల్ పెట్టాలనుకున్నారు కూడా. చదువులో వెనకబడే విద్యార్థులను మాత్రమే అందులో చేర్చించుకొని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకోసం హైటెక్ సిటీలో స్థలం కొనుగోలు చేశారు కూడా. ఎందుకోగానీ అది కార్యరూపం దాల్చలేదు. కోట హరినారాయణ సెంట్రల్ వర్సిటీ వీసీగా ఉండగా ఎన్నో ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నారు కలాం. విద్యార్ధి సంఘాలతోనూ ఆయనకు పరిచయముంది.  ఎప్పుడైనా ప్రసంగం తరవాత ‘ఎనీ క్వశ్చన్స్?’ అని అడగడం కలాంకు బాగా అలవాటు. ఓసారి అలాగే సెంట్రల్ వర్సిటీ  స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం తర్వాత కూడా అలాగే అడగటంతో విస్తుపోవడం విద్యార్థుల వంతైంది.
 
 నగరవాసులకు ఎంతో ఇష్టుడు
 
 కలాం గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ఇక పిల్లలంటే ఆయనకెంతో ప్రేమ. కొద్దిగా మూసిన కళ్లు, పెదాలపై చెరగని చిరునవ్వుతో చేయి పెకైత్తి చేసే అభివాదం, పొడవాటి జులపాలను పైకి ఎగదోసుకుంటూ చేసే గంభీరమైన ఉపన్యాసాలు, సభికుల నుంచి ప్రశ్నలు ఆహ్వానిస్తూ, వాటికి సమాధానాలిస్తూ సాగే కలాం సభల దృశ్యాలు అందరికీ చిరపరిచితమే. హైదరాబాద్‌లో వందకు పైగా స్కూళ్లు, కాలేజీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. పిల్లలు, యువకులతో ఎప్పుడు మాట్లాడినా శాస్త్ర పరిశోధనలపైనే ఎక్కువగా చర్చించేవారు.
 
 ‘స్కోప్’తో కలిసి ఉద్యమం
 
 ప్రాణాంతక పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నగరంలో స్కోప్ అనే స్వచ్చంద సంస్థ చేపట్టిన ప్రచారోద్యమానికి కూడా కలాం స్పూర్తిగా నిలిచారు. వంద కోట్ల సంతకాల సేకరణలో తొలి సంతకం తానే చేశారు. లీడ్ ఇండియా సంస్థతో కలిసి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతిగా కూడా భారతీయ విద్యాభవన్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ మహీంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 2015 మే 14న వచ్చిందే హైదరాబాద్‌లో కలాం చివరి కార్యక్రమం.
 

మరిన్ని వార్తలు