ఏటీఎం కార్డు మారి.. రూ.57వేలు గల్లంతు!

3 Jul, 2017 23:36 IST|Sakshi

చిలమత్తూరు (హిందూపురం) :

ఒకరికి రావాల్సిన ఏటీఎం మరొకరికి వెళ్లింది. సదరు ఖాతాదారు ఏటీఎం కార్డుతో రూ.57వేలు డ్రాచేసేశారు. తమ ప్రమేయం లేకుండా నగదు గల్లంతవడంపై బాధితులు కంగుతిన్నారు. వివరాల్లోకెళితే.. చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన బి.ప్రభావతమ్మకు సిండికేట్‌ బ్యాంకులో ఖాతా (నంబర్‌ 31312250037750) ఉంది. ఇందులో రూ.57,700 నగదు ఉంది. వీరికి ఏటీఎం కార్డు ఇంకా రాలేదు. డబ్బు అవసరం కావడంతో భర్త రామాంజనేయులుతో కలిసి ఆమె సోమవారం బ్యాంకుకు వెళ్లారు.

ఖాతాలో రూ.50 మాత్రమే ఉందని క్యాషియర్‌ చెప్పడంతో వారికి గుండె ఆగినంత పనైంది. వెంటనే బ్యాంకు మేనేజర్‌ శ్రీనాథ్‌ను కలిశారు. ఆయన స్టేట్‌మెంట్‌ తీసి చూడగా.. ఏటీఎం కార్డు ద్వారా రూ.57వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. అసలు తమకు ఏటీఎం కార్డే లేదు.. అలాంటపుడు ఎవరు, ఎలా డ్రా చేసి ఉంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది.

దీంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులతో కలిసి బీసీ కాలనీకి వెళ్లి ఆరా తీశారు. ఇదే కాలనీలో మొరంపల్లి గ్రామం నుంచి వచ్చి నివాసముంటున్న ప్రభావతమ్మ, రామాంజి అనే పేర్లు కలిగిన దంపతులు ఉన్నారని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. వారికి వీరి ఏటీఎం కార్డు వెళ్లడంతో పొరబాటు జరిగి ఉంటుందని భావించారు. సదరు మహిళతో మాట్లాడగా.. ఏటీఎం కార్డు తన కుమారుడి వద్ద ఉందని తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని బాధితురాలికి మేనేజర్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు