జిల్లాలో నిరంకుశ పాలన సాగుతోంది

4 Nov, 2016 23:19 IST|Sakshi
కాకినాడ సిటీ: 
జిల్లాలో నిరంకుశ పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శుక్రవారం కాకినాడలోని పార్టి కార్యాలయం, సుందరయ్యభవ¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అరాచకపాలన సాగనివ్వబోమని హెచ్చరించారు. గురువారం దివీస్‌ బహిరంగ సభ నేపధ్యంలో తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావుతోపాటు పలువురు పోలీసులు నాతోపాటు వామపక్ష పార్టీ నాయకులపై భౌతిక దాడులకు దిగారన్నారు. ఎన్నిసార్లు వస్తావురా అంటూ బెదిరంపులకు దిగడం అన్యాయమన్నారు. నా 45 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చెన్నకేశవరావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దివీస్‌ సంఘటనపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మళ్ళీ దివీస్‌ ప్రాంతానికి వెళతామని, పోలీసులు అడ్డుకుంటే ఊరుకోమన్నారు. జిల్లా ఎస్పీని కలిసి దానవాయిపేటలో పోలీసుల భౌతిక దాడిని ఆయన దృష్టికి తీసుకెళతామన్నారు. మా తగాదా పోలీసులతో కాదని, ప్రభుత్వ విధానాలతోనేనని స్పష్టం చేశారు. పంపాది పేటలో దివీస్, గండేపల్లిలో రైస్‌మిల్, పెద్దాపురంలో నెక్కంటి ఆక్వాఫీడ్, జగ్గంపేట మండలం రాజపూడిలో ఎముకల ఫ్యాక్టరీలపై ప్రజలు తిరగబడి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అలాగే ఓఎ¯ŒSజీసీ గ్యాస్‌ లీకేజీ కారణంగా ప్రజల ఆందోళనలు, కరవాకలో మత్స్యకారుల పోరాటం ఇంకా అనేక పోరాటాలు జిల్లాలో జరుగుతున్నా అధికార తెలుగుదేశం పట్టనట్టు వ్యవహరించడం తగదన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు