లడ్డూ అధరహో...!

6 Sep, 2017 07:03 IST|Sakshi
లడ్డూ అధరహో...!

నగర వ్యాప్తంగా గణేశ్‌ లడ్డూ వేలం పాటలు
బాలాపూర్‌లో ఉత్కంఠ..
రూ.15.6 లక్షలకు దక్కించుకొన ్న నాగం తిరుపతిరెడ్డి  
రూ. 5.70 లక్షలు పలికిన బడంగ్‌పేట్‌ లడ్డూ


సాక్షి, సిటీబ్యూరో: గణపతి నిమజ్జనం సందర్భంగా గ్రేటర్‌ నలుచెరుగులా మంగళవారం లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా జరిగాయి. భక్త సమాజాలకు రూ.లక్షల మేర కాసుల వర్షం కురిపించాయి. కోరిన కోర్కెలు తీర్చే లంబోదరుడి లడ్డూలను రూ. లక్షలు వెచ్చించి సొంతం చేసుకొనేందుకు సిటీజన్లు మక్కువ చూపారు. రూ.50 వేల నుంచి రూ.15.60 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలను దక్కించుకునేందుకు రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు ఎవరి స్థాయిలో వారు పోటీ పడ్డారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను వినియోగించనున్నట్లు ఆయా భక్తమండళ్ల  ప్రతినిధులు తెలిపారు.
 
బాలాపూర్‌ లడ్డూ.. రూ. 15.6 లక్షలు
భక్తుల కొంగు బంగారంగా విశేష ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ వేలాన్ని ఉదయం 10 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మొత్తం 20 మంది వేలం పాటలో పాల్గొన్నారు. రూ.1116 నుంచి మొదలైన పాట..నిమిషాల వ్యవధిలో వేలు..లక్షలు దాటి.. రూ. పది లక్షలకు చేరింది. బాలాపూర్‌ గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి (నాగార్జున స్టీల్‌), నాగం తిరుపతిరెడ్డిల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో రూ.15.60 లక్షలకు లడ్డూను నాగం తిరుపతి రెడ్డి దక్కించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శిరస్సున లడ్డూ ప్రసాదం ధరించిన తిరుపతిరెడ్డిని డప్పుదరువు, మేళతాళాలతో స్థానిక వేంకటేశ్వర ఆలయానికి  తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. గతేడాది లడ్డూను దక్కించుకున్న స్కైలాబ్‌రెడ్డిని కూడా ఉత్సవ కమిటీ ప్రతినిధులు సన్మానించారు. అరగంట పాటు  ఉత్కంఠగా సాగిన ఈ వేలంపాటను తిలకించేందుకు అశేషభక్తవాహిని బాలాపూర్‌ గ్రామానికి చేరుకోవడంతో గ్రామానికి దారితీసే దారులన్నీ కిక్కిరిశాయి.

ఘనంగా గణనాథుని ఊరేగింపు...
అంతకు ముందు ఉదయం 5 గంటలకే బాలాపూర్‌ గణనాథున్ని గ్రామంలో ముఖ్యవీథుల్లో ఊరేగించారు. బ్యాండు మేళాలు, డప్పుకళాకారుల నృత్యాలు, భజనబృందాల ఆటపాటలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, దైవజ్ఙశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా..
బాలాపూర్‌ లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా. 2013 ఈ లడ్డూను దక్కించుకున్న తీగల కృష్ణారెడ్డి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికవడం నన్ను విశేషంగా ఆకర్షించింది. నేను కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. గతంలో ఈ లడ్డూ దక్కించుకున్న వారిని ఎన్నో విజయాలు వరించాయి. అదే స్ఫూర్తితో ఈ సారి ఎలాగైనా ఈ ప్రసాదాన్ని దక్కించుకోవాలని వేలం పాటలో పాల్గొన్నా. ఈ లడ్డూ ద్వారా వచ్చిన ఆదాయా న్ని గ్రామస్తులు సేవా కార్యక్రమాలు, ఆలయం అభివృద్ధికి వినియోగిస్తుండటం గొప్ప విషయం. – నాగం తిరుపతిరెడ్డి, బాలాపూర్‌ లడ్డూ విజేత

కూలీ స్థాయి నుంచి ఎదిగా...
దినసరి కూలీ స్థాయినుంచి గణపతి ఆశీస్సులతో అభివృద్ధి చెందా. వీరాంజనేయ భక్తసమాజం లడ్డూను దక్కించుకోవడంతో కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తున్నాయి. ఈ సారితో కలిపి మొత్తం ఐదుసార్లు బడంగ్‌పేట లడ్డూను దక్కించుకున్నా. మళ్లీ లడ్డూను వేలంలో కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైనపుడు ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకొని కేటీఆర్‌కు కానుకగా ఇచ్చా. ఈసారి కూడా మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇస్తా.    – కర్రె కృష్ణ ,బడంగ్‌పేట్‌ లడ్డూ ప్రసాద విజేత

బడంగ్‌పేట్‌  @ రూ.5.70 లక్షలు
బడంగ్‌పేట గణపయ్య లడ్డును ఈ సారి రూ.5.70 లక్షలకు టీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె కృష్ణ దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన రాములమ్మ నందు, పెద్దబావి పార్వతమ్మ అండ్‌ సన్స్, కర్రె కృష్ణల మధ్య వేలం పాట ఉత్కంఠగా సాగింది. చివరకు కర్రె కృష్ణ రూ.5.70 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని దక్షించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. గతంలో కర్రె కృష్ణ ఇదే లడ్డూ ప్రసాదాన్ని తొలిసారి 55 వేలకు, రెండోసారి రూ.70 వేలకు, మూడోసారి రూ.4  లక్షలకు, నాలుగోసారి రూ.5.15 లక్షలకు, ఈసారి రూ.5.70 లక్షలకు  దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.5.40 లక్షలు పలికిది. ఈ సారి రూ.30 వేలు ఎక్కువకు పాడుకున్నారు. అనంతరం డప్పు వాయిద్యాలు, కోలాటాలు, కోయ నృత్యాల మధ్య బడంగ్‌పేట గణనాథుడ్ని గ్రామంలో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు.