'బీజేపీ,టీడీపీలకు పుట్టగతులుండవ్‌'

16 Sep, 2016 22:31 IST|Sakshi
'బీజేపీ,టీడీపీలకు పుట్టగతులుండవ్‌'

కడప వైఎస్సార్‌ సర్కిల్‌ : వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడా పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌లో రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విభజనచట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని డిమాండ్‌ చేశారు. బుందేల్‌ఖండ్‌ తరహాలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. వెనుకబడిన సీమలోని జిల్లాలకు రూ.50 కోట్లు నిధులు ఇస్తే అవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ, విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకోసం విద్యార్థులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలన్నారు.

ఐదేళ్లు సరిపోదు పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో డిమాండ్‌ చేసిన వెంకయ్యనాయుడు తీరా అధికారంలోకి వచ్చాక మాటమార్చడం సబబు కాదన్నారు. ఎన్నికల్లో సైతం చంద్రబాబు ప్రత్యేకహోదా 15 సంవత్సరాలు కావాలని, విభజన హామీలు నెరవేర్చేందుకు కృషిచేస్తానని చెప్పి ఇప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్‌లు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు