దళితుల హక్కులే ఊపిరిగా ఉద్యమించిన తారకం

15 Oct, 2016 23:06 IST|Sakshi
  • విరసం నేత వరవరరావు
  • అమలాపురం టౌన్‌ :
    దళితుల హక్కులే ఊపిరిగా ఉద్యమించిన నేత బొజ్జా తారకమని విరసం నేత వరవరరావు కొనియాడారు. తలపండిన రాజకీయ నేతగా... సమాజాన్ని కాచి వడబోసిన సామాజికవేత్తగా...న్యాయ కోవిదుడిగా... ఉద్యమ నేతగా దళితుల అభ్యున్నతి కోసం తారకం పోషించిన పాత్రలు సమాజాన్ని తట్టి లేపాయని చెప్పారు. భారత రిపబ్లికన్‌ పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో శనివారం సాయంత్రం జరిగిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ  ప్రధానిమంత్రిగా మోదీ పదవి చేపట్టాక దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. చివరకు ఆవుల చర్మాలు వలుచుకుని కుల వృత్తితో జీవించే చర్మకారులపై కూడా గోవుల ముసుగులో కోనసీమలో దాడులు జరగటం బాధాకరమన్నారు. రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమాల సుధీర్‌ అధ్యక్షతన జరిగిన సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, మరో విరసం నేత యు.భీమారావు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రత్యేక అతి«థులుగా హాజరై తారకం ఉద్యమ త్యాగాలను కొనియాడారు. కోనసీమ నుంచే తారకం తన ఉద్యమ పంథాకు పదును పెట్టి తన పోరాట గళాన్ని ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీలో కూడా వినిపించారని ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య అన్నారు. తొలుత తారకం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీసీపీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, జిల్లా మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు నామాడి శ్రీధర్‌తో పాటు ఆర్‌పీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు