ముగ్గురిపై హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు

28 Jul, 2016 00:52 IST|Sakshi
ముగ్గురిపై హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు
27కెఎంఆర్‌11ః నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పట్టణ సీఐ శ్రీనివాస్‌రావ్‌
––––––––––––––––––––––––––––––––––––––––––
కామారెడ్డి : డబ్బుల విషయంలో ఘర్షణ పడి తల్వార్‌తో ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పట్టణ సీఐ ఎస్‌.శ్రీనివాస్‌రావ్‌ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీలో హసన్‌చావూస్, బదర్‌అలీలు అదే కాలనీకి చెందిన హసన్‌బీ, షరీఫ్, రజియాబేగంలపై తల్వార్‌తో దాడి చేసి గాయపర్చారు. ఈ కేసులో హసన్‌ చావూస్, బదర్‌అలీలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బదర్‌అలీ, హసన్‌చావూస్, శేక్‌అలీలు స్నేహితులు. ముగ్గురు కలిసి శేక్‌అలీ డబ్బులు రూ.5 వేలతో పీకలదాకా తాగారు. రాత్రి ఇంటికి చేరిన తర్వాత డబ్బుల కోసం శేక్‌ అలీ బదర్‌అలీని అడిగాడు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బదర్‌అలీ ఇనుపరాడ్‌తో  శేక్‌అలీ తలపై బాదాడు. ఇది చూసిన శేక్‌అలీ బావమరిది షరీఫ్‌ అడ్డుకోబోగా హసన్‌చావూస్‌ తల్వార్‌ తీసుకువచ్చి షరీఫ్‌పై దాడిచేశాడు. దీంతో షరీఫ్‌ బొటనవేలు తెగిపోయింది. కాళ్లు, తలపై తల్వార్‌గాట్లు పడ్డాయి. షరీఫ్‌ తల్లి హసన్‌బీ పరుగెత్తుకుని రాగా ఆమెపై కూడా తల్వార్‌తో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది. షరీఫ్‌ వదినపై కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ప్రథమ నిందితుడిగా హసన్‌చావూస్, రెండో నిందితుడిగా బదర్‌అలీలను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. హసన్‌చావూస్‌ జులాయిగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ముగ్గురిపై హత్యాయత్నం చేయడంతో ఆయనపై రౌడీషీట్‌ తెరిచినట్లు సీఐ వివరించారు. విలేరుల సమావేశంలో పట్టణ ఎస్సైలు శోభన్, శోభన్‌బాబు, ఏఎస్సైలు సత్యం, మజార్, సిబ్బంది ఉన్నారు.
నేరాలకు పాల్పడేవారిపై రౌడీషీట్‌ తెరుస్తాం...
పట్టణంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిలో ఆరుగురిని ఇప్పటికే గుర్తించామని, త్వరలో వారిపై రౌడీషీట్‌ తెరుస్తామని సీఐ శ్రీనివాస్‌రావ్‌ అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, బెదిరింపులు, దాడులకు పాల్పడిన వారిపై నిఘా ఉంచామన్నారు. నేరచరిత్ర ఉన్న వారిలో ఇప్పటికే 130 మందిని బైండోవర్‌ చేశామని, మరోసారి నేరాలకు పాల్పడితే ఆరునెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. భాషా అనే నేరస్తున్ని జైలుకు పంపినట్లు తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీయాక్టు కూడా నమోదు చేస్తామని, పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న మంచిప్పకు చెందిన గోత్రాల నాగరాజుపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని చెప్పారు. పట్టణంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, న్యూసెన్స్, ఓవర్‌లోడ్, హైస్పీడ్, వితవుట్‌ హెల్మెట్, డేంజరస్‌ డ్రైవింగ్‌ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఐ స్పష్టం చేశారు. ఏటీఎంల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
మరిన్ని వార్తలు