వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక..

4 Sep, 2016 21:08 IST|Sakshi
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక..
వ్యక్తి ఆత్మహత్య
 
మాచర్ల రూరల్‌: వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల వారి వేధింపులు తాళలేక ఓ వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం అర్ధరాత్రి పట్టణ శివారులోని ఎంఎస్‌ఆర్‌ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన పూలా సీతారామయ్య (50) ఎరువులు, పురుగు మందులు, రైస్‌మిల్, పొక్లెయిన్‌ యంత్రంతో వ్యాపారాలు చేసే వారు. వ్యాపారంలో నష్టాలు, తనకు ఇవాల్సిన బాకీలు రాక అప్పులు చెల్లించకలేకపోయారు. దీంతో అప్పులిచ్చిన అధికార పార్టీకి చెందిన వారు సీతారామయ్య 8 ఎకరాల భూమితోపాటు కుటుంబ సభ్యుల 10 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. తనకు రావాల్సిన అప్పులను కూడా వాల్చుకోవాలని సీతారామయ్య కోరారు. దీనికి అంగీకరించకుండా అధికార పార్టీ సామాజికవర్గం వారు సీతారామయ్య మిరప పంటను ఎవరూ కోయకూడదని, వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన జిల్లా కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించాలని కారంపూడి తహసీల్దార్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి గురజాల పోలీసు అధికారుల వద్దకు సీతారామయ్య పంచాయతీ చేరింది. పట్టణ శివారులోని ఎంఎస్‌ఆర్‌ టౌన్‌షిప్‌ నివాస గృహంలో నాలుగు నెలల కిందట అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడ ఉన్న అధికార పార్టీ వారు అర్ధరాత్రి వచ్చి తీవ్ర ఒత్తిడి చేశారు. ఉన్న ఆస్తులు మొత్తం బలవంతంగా రాయించుకున్నా ఇంకా వారి పంథా మారకపోవటంతో మానసిక ఒత్తిడికి లోనై పురుగుమందు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు భార్య నాగమల్లేశ్వరి, ఇద్దరు కుమారులున్నారు.  అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లిదండ్రులు గోవిందమ్మ, వెంకటేశ్వర్లు, తమ్ముడు నారాయణ రోదిస్తూ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు విజయపురిసౌత్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు