పెద.. కాపు కాసిందెవరు?

3 Jul, 2017 02:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గంజాయి స్మగ్లింగ్‌లో పాడేరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ పెదకాపు శ్రీనివాసరావు పాత్ర రూఢీ కావడం.. ఆయన్ను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌ చేయడం ఆబ్కారీ వర్గాల్లో కలకలం రేపింది. పోలీసుల విచారణలో పెదకాపు ఏయే వాస్తవాలు బయటపెడతారు.. ఎవరి మెడకు చుట్టుకోనుందోనన్న ఆందోళన ఎక్సైజ్‌ వర్గాల్లో కనిపిస్తోంది.

గంజాయి స్మగ్లింగ్‌లో ఎక్సైజ్‌ పోలీసుల ప్రమేయంపై ఆరోపణలు రావడం.. ఒకరిద్దరు కిందిస్థాయి ఉద్యోగుల పాత్ర ఉందని ఖరారు కావడం అడపాదడపా జరుగుతున్నదే కానీ ఏకంగా సీఐ స్థాయి అధికారి స్వయంగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడని, నేరస్తులతో చేతులు కలిపి తానే దగ్గరుండి గంజాయిని సురక్షిత ప్రాంతాలకు పంపేవాడని పోలీసుల దర్యాప్తులో స్పష్టం కావడం బహుశా ఇదే మొదటిసారి.

అసలేం జరిగింది..: గత ఏడాది అక్టోబర్‌లో పాడేరు ఘాట్‌ రోడ్‌లో ఓ తారు ట్యాంకర్‌ ద్వారా గంజాయి రవాణా అవుతోందని పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేయగా, అందులో 1200 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే ట్యాంకర్‌ డ్రైవర్‌తో సహా ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారించగా... ఎక్సైజ్‌ మొబైల్‌ పార్టీ సీఐ పెదకాపు శ్రీనివాసరావు ప్రోద్బలంతోనే తాము రవాణా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆరా తీసిన పోలీసులకు శ్రీనివాసరావు ఎక్సైజ్‌ సీఐ ముసుగులో పాల్పడుతున్న దందాలన్నీ బయటపడ్డాయి.

అనకాపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలోకి వచ్చే పాడేరు ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఇద్దరు సీఐలు ఉంటారు. ఒకరు మొబైల్‌ పార్టీ సీఐ.. మరొకరు ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐ.. కానీ శ్రీనివాసరావు పనిచేసిన హయాంలో ఏడాదిన్నర పాటు ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐ లేకపోవడంతో మొత్తం ఈయనే చుట్టేసేవాడు. ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడు. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ రవాణాకు సహకరించేవాడు.

గంజాయి తరలిస్తున్న వాహనాలకు పెదకాపు ఎస్కార్ట్‌గా వ్యవహరించేవాడనీ, దగ్గరుండి సరిహద్దులు దాటించే వాడన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా ఈయనే గంజాయి రవాణా వాహనాల్లో ఉండటంతో పోలీసులకు సైతం అనుమానమొచ్చేది కాదు.. ఒక్కోసారి ఈయనకు వీలు కాని సందర్భాల్లో  తన మనుషులనే ఎస్కార్ట్‌గా పంపించేవాడన్న వాదనలు ఉన్నా యి. ఇక గంజాయి వ్యాపారస్తులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఉత్తుత్తి దాడులు చేపట్టి ఒకటి రెండు నామమాత్రపు కేసులు నమోదు చేసేవాడు. ఈయన గతంలో మాడుగుల ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పనిచేసినప్పుడూ లెక్కకు మించిన ఆరోపణలు మూటగట్టుకున్నాడు.

తెర వెనుక కాపు కాసిందెవరు?
ఎక్సైజ్‌ అధికారవర్గాల్లో పెదకాపు శ్రీనివాసరావుకు సహకరించింది ఎవరు.. ఆయన తరహాలోనే అక్రమాలకు పాల్పడిందెవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు పెదకాపు వ్యవహారాలు మొత్తం తెలుసని, వాళ్ల అండతోనే ఇతను ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారన్న వాదనలున్నాయి. ఆ ఇద్దరు అధికారుల ప్రోద్బ లంతోనే ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు. ఇక ఆ మధ్యన గాజువాకకు బదిలీ అయిన అధికారులతోనూ పెదకాపుకు అవినీతి సం«బంధాలు ఉండేవని తెలుస్తోంది.

ఈ అధికారులంతా ఓ ముఠాగా ఏర్పడి జిల్లా దాటకుండా మన్యం స్మగ్లర్లతో కుమ్మక్కై లక్షలు దోచుకుతిన్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ ముఠాలోని ఏ అధి కారికైనా వేరే జిల్లా బదలీ అయితే... ఎలాగోలా నిలుపుదల చేయించుకునే వారని అంటున్నారు. ఇటీవల ఓ అసిస్టెంట్‌ ఎక్సై జ్‌ సూపరింటెం డెంట్‌కు కాకినాడ బదలీ అయితే ఇదే మాదిరి ఉన్నతాధికారుల వద్ద పావులు కదిపి తిరిగి గాజువాకకు బదిలీ చేయించుకున్నారని తెలుస్తోంది. డ్యూటీ గాజువాకలో అయినా.. నిత్యం  ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి రావడం వారికి ఆనవాయితీగా మారిందని అంటున్నారు. పెదకాపు పట్టుబడి పోలీసుల విచారణలో నోరు విప్పితే ఎక్సై జ్‌ శాఖలోని అవినీతి తిమింగలాలన్నీ బయటకు వస్తాయి.  

ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు తెలిసినా..
వాస్తవానికి పెదకాపు శ్రీనివాసరావు వివాదాస్పద వ్యవహారశైలి, అక్రమార్జన, అవినీతి ఆరోపణలపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు ముందు నుంచి సమాచారముంది. రెండు మూడేళ్లుగా అతనిపై లెక్కకు మించిన ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఉన్నతాధికారులు కనీసంగా కూడా స్పందించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. గతేడాది అక్టోబర్‌లో పోలీసుల విచారణలో బయటపడిన తర్వాత కూడా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు అతని గురించి పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల ఉదా సీనతపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇటీవలే వీఆ ర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వా త పెదకాపు శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం అతను పరారీలో ఉన్న విషయం కూడా పోలీసులకు సమాచారమివ్వలేదు.

మరిన్ని వార్తలు