రూ. 540 కోట్లతో రాజధాని యాక్సెస్ రోడ్

13 Feb, 2016 03:58 IST|Sakshi
రూ. 540 కోట్లతో రాజధాని యాక్సెస్ రోడ్

- అంచనా వేసిన సీఆర్‌డీఏ
-  21.5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి
-  కొండవీటి వాగుపై 1.4 కిలోమీటర్ల ఫ్లైఓవర్
-  భూ సేకరణపై అధికారుల మల్లగుల్లాలు

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నగరాన్ని జాతీయ రహదారికి అనుసంధానించే యాక్సెస్ (ఎక్స్‌ప్రెస్ వే) రోడ్డు అంచనా వ్యయం రూ. 540 కోట్లుగా సీఆర్‌డీఏ లెక్క తేల్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర కనకదుర్గ వారధి నుంచి సీడ్ కేపిటల్ వరకూ 21.5 కిలోమీటర్ల మేర ఈ నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు. అందులోనే కొండవీటి వాగుపై 1.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్) నిర్మిస్తారు. దీన్లో రహదారిని ఒక ప్యాకేజీగా, ఎలివేటెడ్ కారిడార్‌ను మరో ప్యాకేజీగా విభజించి పనులు చేపట్టనున్నారు. 60 మీటర్ల వెడల్పుతో నిర్మించే రహదారిని రూ. 280 కోట్ల అంచనాతో మొదటి ప్యాకేజీగా, ఎలివేటెడ్ కారిడార్‌ను రూ. 260 కోట్లతో అంచనాతో రెండో ప్యాకేజీగా నిర్మించాలని నిర్ణయించారు.
 
 రాజధానిలో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ వేలున్నా బయట ప్రాంతానికి అనుసంధానంగా ఉండే ఈ యాక్సెస్ రోడ్డుకే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలుత రాజధాని నిర్మాణాన్ని ఈ రోడ్డుతోనే ప్రారంభించాలనుకున్నా తాత్కాలిక సచివాలయం ప్రతిపాదనతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు తయారయ్యాయి. అయితే అనేక మార్పుల తర్వాత ఇటీవలే ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంతోపాటే ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని ప్రయత్నించినా సాధ్యాసాధ్యాల నివేదిక (ఫీజిబిలిటీ రిపోర్టు) రావడం ఆలస్యమవడంతో టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం నిర్మాణ టెండర్లలో ప్రతిష్టంభన తొలగిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవడానికి కసరత్తు చేస్తారు.  
 
 53 ఎకరాల భూమి అవసరం
 కనకదుర్గ వారధి నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారిని మణిపాల్ ఆస్పత్రి వెనుకవైపు నుంచి తాడేపల్లి, ఉండవల్లి, కృష్ణాయపాలెం మీదుగా నిర్మించే యాక్సెస్ రోడ్‌కు సుమారు 53 ఎకరాలు సేకరించాల్సివుంది. అందులో 24 ఎకరాలు రైతులవి కాగా.. మిగిలినవి ప్రభుత్వ భూములు. రైతుల భూముల్లో కొన్ని రాజధాని నగర పరిధిలో లేనివి కూడా ఉన్నాయి. వాటిని భూ సమీకరణ ద్వారా తీసుకునే అవకాశం లేకపోవడంతో ఎలా సేకరించాలనే దానిపై సీఆర్‌డీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల సమీపంలో ఎకరం భూమి విలువ రూ. 8 కోట్ల నుంచి రూ. 9 కోట్ల వరకూ ఉండడంతో సేకరణ ఎంతవరకూ సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోడ్డు వల్ల తమ గ్రామం దెబ్బతింటుందని కృష్ణాయపాలెం, ఉండవల్లి ప్రజలు ఆందోళనకు దిగడంతో ఇప్పటికే డిజైన్‌లో స్వల్పంగా మార్పులు చేస్తున్నారు. 21 కిలోమీటర్ల ఈ రోడ్డుకు సర్వీసు రోడ్లు లేకపోవడంతో దానికి రెండువైపులా ఉన్న గ్రామాలు, పొలాల్లోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి అనుసంధానించేఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం అంత తేలిక కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు