మా భాష అర్థం కాదులెండి!

5 Jan, 2017 23:52 IST|Sakshi
మా భాష అర్థం కాదులెండి!

– ప్రజాప్రతినిధులతో కేంద్ర బృందం భేటీ
– ‘విజయగాథ’ల కోసం వచ్చిన సెంట్రల్‌ టీం
– అది తెలియక సమస్యల చిట్టావిప్పిన జెడ్పీ సభ్యులు

అనంతపురం టౌన్‌ : ‘జిల్లా పరిషత్‌ సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరుగుతున్నాయి. కానీ అంతా చర్చలకే పరిమితం. నిధులు లేవు.. నిర్ణయాలు తీసుకోవడమే గానీ అమలు చేయలేని పరిస్థితి. ఎవరో చేసిన దానిపై చర్చ జరుగుతుంది. మా ఊరి సమస్యలొక్కటే చెప్పగలుగుతున్నాం. కేవలం సభ్యులుగా ఎన్నికయ్యామంతే.. ఐదేళ్లుంటాం.. మాకిక్కడ ఏదీ లేదు’ ఇదీ కేంద్ర బృందంతో జరిగిన భేటీలో పెనుకొండ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణస్వామి ఆవేదన. జిల్లా పరిషత్‌ పనితీరును పరిశీలించేందుకు సెంటర్‌ ఫర్‌ రూరల్‌  మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ సునీల్, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ బాలమురళి రెండ్రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ముగియడంతో గురువారం జెడ్పీ భవనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.

బృందానికి కావాల్సింది కేవలం జెడ్పీ పరిపాలన ఎలా జరుగుతోందన్నదే. కానీ ఈ విషయం సమావేశానికి వచ్చిన జెడ్పీ సభ్యులకు తెలియదు. దీంతో రెండున్నరేళ్లుగా తాము ఎంతగా ఇబ్బందులు పడుతున్నామో వివరించే ప్రయత్నం చేశారు. సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చిన నారాయణస్వామి చేతికి మైక్‌ ఇవ్వగానే పై విధంగా మాట్లాడారు. జెడ్పీ సీఈఓ రామచంద్ర కలుగజేసుకుని బృందం సభ్యులకు నిధులు విడుదల చేసే అధికారం లేదని, సమస్యలు కాకుండా విజయగాథలు తెలియజేయాలన్నారు. దీంతో ‘సరే..సరే.. మా భాష ఎలాగూ వారికి అర్థం కాదులెండి’ అనడంతో అక్కడున్న వారిలో నవ్వులు పూయించింది.

కలెక్టర్‌తో ముడిపెట్టొద్దు :
జెడ్పీ సమావేశాల్లో ఒక అంశంపై తీర్మానం చేస్తే దాన్ని అమలు చేయడం లేదు. కలెక్టర్‌కు పంపుతున్నారు. జెడ్పీ ప్రధానమా? కలెక్టర్‌ ప్రధానమా.? ప్రతి దానికీ కలెక్టర్‌తో ముడిపెట్టొద్దు.. అని జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రారెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ అన్నారు. జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసమూర్తి, విశాలాక్షి, వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు నేరుగా పంచాయతీలకే వెళ్తుండడంతో ఇబ్బందిగా ఉందన్నారు.

‘ఉపాధి’ ప్రగతి భేష్‌ :
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ప్రగతి బాగుందని కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. పీడీ నాగభూషణంను అభినందించారు. ఈ ఏడాది జరుగుతున్న పనుల వివరాలను, దేశంలోనే అత్యధికంగా ఫారంపాండ్ల తవ్వకాలు చేపడుతున్నట్లు పీడీ చెప్పగా.. నివేదికలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ‘సామూహిక సీమంతాలు’ చేపట్టడంపై పీడీ జుబేదాబేగంను ప్రశంసించారు.  

సీఎం భజన చేసిన జెడ్పీ చైర్మన్‌
హిందీలో ప్రసంగించిన జెడ్పీ చైర్మన్‌ చమన్‌సాబ్‌ సీఎం భజన చేశారు. మొదట జెడ్పీ పరిపాలన సాగుతున్న తీరును వివరించారు. ఆ తర్వాత అందరూ 8 గంటలే పని చేస్తారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం 18 గంటలు పని చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు