తరలివస్తే.. సదుపాయాలు కల్పిస్తాం

11 Jan, 2016 18:21 IST|Sakshi
తరలివస్తే.. సదుపాయాలు కల్పిస్తాం

సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖపట్నం
ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, తరలివచ్చి పెట్టుబడులు పెట్టాలని  సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలో సోమవారం రెండో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో 'సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్: కలల సాఫల్యం-విజన్ 2029' అంశంపై ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. ''ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి దేశవిదేశాల నుంచి వచ్చిన ఇన్వెస్టర్లకు నాది భరోసా. సుపరిపాలన, జవాబుదారీతనం, పారదర్శక విధానాలను పాటిస్తూ సింగిల్ డెస్క్ విధానంతో అనుమతులు వేగవంతంగా ఇస్తాం'' అని ముఖ్యమంత్రి ఆహ్వానితులకు వివరించారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీలకు దక్షిణ భారతీయులే సీఈఓలుగా ఉన్నారని గుర్తుచేశారు.

సమ్మిళిత వృద్ధితోనే సామాన్యులకు ఫలాలు
అభివృద్ధి చెందిన సమాజంలో అభివృద్ధి ఫలాలు పై నుంచి కింది స్థాయికి వాటంతట అవే చేరవని సీఎం చంద్రబాబు అన్నారు. ఆకాంక్షలు నిజం కావాలంటే ప్రభుత్వ విధాన రూపకల్పనదారులు సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. అభివృద్ధి-పేదల సంక్షేమాన్ని తాను ఎలా సమన్వయం చేసుకువస్తున్నదీ ఆహ్వానితులకు వివరించారు. రెండూ పరస్పర విరుద్ధ అంశాలని అందరూ భావిస్తారని, అయితే అది సరికాదని తాను నిరూపించానని చెప్పారు. ప్రాధాన్యక్రమంలో జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేస్తున్నామని తెలిపారు.

సేద్యపుకుంటలు, రెయిన్ గన్స్, బిందుసేద్యం ద్వారా కరవు పీడిత జిల్లాలను సస్యశ్యామలం చేయటానికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. 10 లక్షల సేద్యపు కుంటలను తవ్వాలని, రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో ఈ లక్ష్యం చేరుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో బలంగా ఉందని, దేశంలోని ఎగుమతులలో 40 శాతం వాటా ఉందని ముఖ్యమంత్రి వివరించారు.

>
మరిన్ని వార్తలు