కులాల మధ్య చిచ్చు పెట్టిన బాబు

29 Sep, 2016 00:03 IST|Sakshi
కులాల మధ్య చిచ్చు పెట్టిన బాబు
– కార్పొరేట్‌ చేతుల్లో కీలుబొమ్మగా మారిన సీఎం
– రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం  
– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
 
కర్నూలు సిటీ: ఓట్ల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..కులాల మధ్య చిచ్చు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సామాజిక హక్కుల వేదిక కన్వీనర్‌ జగన్నా«థం అధ్యక్షతన ప్రై వేటు రంగంలో రిజర్వేషన్లు, అమరావతి ఫ్రీజోన్‌ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చారన్నారు. ఆయన ఇచ్చిన హామీలు అమలు కావాలంటే దేశ బడ్జెట్‌ మొత్తం ఏపీకి ఇచ్చినా సరిపోదన్నారు. కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో సీఎం కీలుబొమ్మగా మారారని విమర్శించారు. రాధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 
 
అమలుకాని రిజర్వేషన్లు..
దేశంలో బ్యాంకులకు కార్పొరేట్‌ సంస్థలు రూ. 34 లక్షల కోట్లు  బకాయిలు పడ్డాయని, వారు చెల్లించకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఐదేళ్లలో కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకులు..రూ. 1.06 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దేశంలో 612 మంది జడ్జీలు ఉంటే బీసీలు 53 మంది, ఎస్సీలు 38 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో 29 మంది జడ్జీలు ఉంటే ప్రస్తుతం 27 మంది మాత్రమే పని చేస్తున్నారని, ఇందులో ఒక్క బీసీ, ఎస్టీ కూడ లేరని, ఎస్సీ వర్గానికి చెందిన జడ్జీ ఒక్కరు మాత్రమే ఉన్నారన్నారు. ఏపీ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న ముగ్గురు జడ్జీలు ఒకే కులానికి చెందిన వారని గుర్తు చేశారు. 
 
కార్పొరేట్‌ను కాపాడే యత్నం..
ఏపీలో 80 శాతం ఇంటర్‌ విద్యార్థులు నారాయణ, శ్రీచైతన్య కార్పొరేట్‌ విద్యాసంస్థలో ఉన్నారని.. రాష్ట్రంలో రూ. 500 కోట్ల మెడికల్‌ స్కామ్‌ జరిగితే ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా వారిని కాపాడేయత్నం చేస్తోందని రామకృష్ణ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ తరహాలో కార్పొరేట్‌ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, అధిక ఫీజులు వసూలు చేసే సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైయఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐయస్‌యఫ్‌ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగన్న, ట్రై బల్‌ విద్యార్థి సంఘం జిల్లా అద్యక్షులు చంద్రప్ప తదితరులు  పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు