ఏదీ శిశు‘వికాసం’?!

10 Jun, 2017 23:17 IST|Sakshi
ఏదీ శిశు‘వికాసం’?!

– చిన్నారుల టీకాలపై వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం
– పది రోజులుగా అందుబాటులో లేని ‘ఐపీవీ’
– సరిపడా తెప్పించడంలో అధికారుల వైఫల్యం
– అవస్థలు పడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు  


అనంతపురం మెడికల్‌ : సకాలంలో టీకాలు వేయించడం శిశు వికాసానికి దోహదపడుతుంది. భవిష్యత్‌లో వచ్చే ప్రాణాంతక వ్యాధులకు ఈ టీకాలే రక్షణగా నిలుస్తాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా పిల్లలకు సకాలంలో వ్యాక్సినేషన్‌ చేయించలేని పరిస్థితి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా పది రోజుల నుంచి ఇన్‌యాక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌ (ఐపీవీ) అందుబాటులో లేదు. మన జిల్లాలో ఒక బోధనాస్పత్రి (అనంతపురం సర్వజనాస్పత్రి), హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నాయి. ఆయా ఆస్పత్రుల పరిధిలో ఏటా సుమారు 70 వేల మందికి పైగా చిన్నారులకు టీకాలు వేయించాల్సి ఉంటుంది. పిల్లలు వైకల్యం, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు పుట్టినప్పటి నుంచి ఆరోగ్య శాఖ నిర్ణయించిన సమయంలో వ్యాక్సిన్లు ఇప్పించాలి.

వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తాయి. ఈ టీకాలన్నింటిలో ప్రధానమైనది ఐపీవీ. చిన్నారులు పోలియోబారిన పడకుండా ఉండేందుకు దీన్ని వేస్తారు. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఐపీవీ కొరత ఏర్పడింది. నిత్యం పదుల సంఖ్యలో వచ్చే సర్వజనాస్పత్రిలో ‘ఐపీవీ సూదిమందు లేదు’ అని బోర్డు పెట్టేశారు. ఇక్కడికి అనంతపురం నగరం నుంచే కాకుండా చుట్టు పక్కన మండలాల నుంచి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని వస్తుంటారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా బిడ్డకు ఆరు వారాల వయసు వచ్చాక ఐపీవీ–1 వేయాలి. 14 వారాలకు రెండో వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవీ ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రులకు వచ్చి వెనుదిరుగుతున్నారు. సర్వజనాస్పత్రికి వస్తున్న వారికి ఇక్కడి సిబ్బంది మరో వారం తర్వాత రండి అని చెప్పి పంపిస్తున్నారు.

ఇప్పటికే 10 రోజులుగా ఈ వ్యాక్సిన్‌ అందుబాటులో లేకున్నా అధికారులు వాటిని తెప్పించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. కర్నూలులో ఉన్న రీజనల్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి మనకు వ్యాక్సిన్లు సరఫరా కావాల్సి ఉంది. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వ్యాక్సిన్ల కొరత ఉంటే ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవాలి. కానీ రాష్ట్రానికి సరఫరా అయ్యే వ్యాక్సిన్లను జిల్లాల వారీగా విభజించి పంపిణీ చేస్తుండడంతో ఇక్కడి అధికారులు కనీసం ఇండెంట్‌ కూడా సరిగ్గా పెట్టడం లేదు. దీంతో వచ్చిన వాటిలోనే ఆస్పత్రుల స్థాయిని బట్టి పంపిణీ చేస్తున్నారు. సర్వజనాస్పత్రికి ఎక్కువ కేటాయిస్తున్నామని చెబుతున్నా అవి పది, 15 రోజులకే అయిపోతున్న పరిస్థితి. జిల్లాకు ప్రతి నెలా 8 వేల డోస్‌లు అవసరం అవుతుండగా సగం కూడా అందడం లేదు. జిల్లా పాలనాయంత్రాంగం ఇప్పటికైనా స్పందించి తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇక్కడ కూడా లేదన్నారు
పాపకు మూడో రోడ్డులో ఉన్న సెంటర్‌లో టీకాలు వేయించేదాణ్ణి. ఐపీవీ వేయిద్దామని వెళితే లేదన్నారు. పెద్దాస్పత్రికి వెళ్లాలని అక్కడున్న వాళ్లు చెబితే వచ్చా. కానీ ఇక్కడ కూడా లేదు. వారం తర్వాత రమ్మన్నారు.
- యమున, రహమత్‌నగర్, అనంతపురం

15వ తేదీ రావాలంట
మామూలుగా వ్యాక్సిన్స్‌ అన్నీ పెద్దాస్పత్రిలోనే వేయిస్తా. ఈ రోజు (శుక్రవారం) ఐపీవీ వ్యాక్సిన్‌ వేయించాల్సి ఉంది. బుక్కులో చూసుకుని వస్తే అది లేదన్నారు. ఈ నెల 15వ తేదీన ఒకసారి వచ్చి వెళ్లమన్నారు. అప్పుడు కూడా వస్తుందో రాదో!. 
- శారద, అశోక్‌నగర్, అనంతపురం

మరిన్ని వార్తలు