సింహపురి క్రిస్మస్‌ మహోత్సవాలు ప్రారంభం

21 Dec, 2016 01:33 IST|Sakshi
సింహపురి క్రిస్మస్‌ మహోత్సవాలు ప్రారంభం
నెల్లూరు(బృందావనం): యేసు ప్రభువును కీర్తిస్తూ మధురమైన క్రైస్తవ భక్తిగీతాలు.. చిన్నారుల నృత్యాలు.. క్రిస్మస్‌ పండగను ప్రతిబింబించే అలంకరణలు.. దేవుని వాక్య సందేశాలు.. కనువిందుచేసే విద్యుద్దీపాలంకరణలు..శాంతాక్లాజ్‌  సందడి నడుమ నగరంలోని వీఆర్‌ ఉన్నత పాఠశాల మైదానంలో రెండు రోజులు జరిగే సింహపురి క్రిస్మస్‌ మహోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐక్య సింహపురి క్రిస్మస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహోత్సవాలకు వేలాదిగా క్రైస్తవులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఐక్యసింహపురి క్రిస్మస్‌ కమిటీ సభ్యుడు బర్నబాస్‌ మాట్లాడారు. మూడేళ్లుగా నగరంలో సింహపురి క్రిస్మస్‌ మహోత్సవాలను కులమతాలకతీతంగా, ప్రజల సహకారంతో విశేషంగా నిర్వహిస్తున్నామన్నారు. తొలుత ముఖ్యఅతిథులు నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ నగరాధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, ఫాదర్‌ జోసఫ్‌ క్రిస్మస్‌ ట్రీని ఆవిష్కరించారు. ప్రజలందరికీ దేవుని కృప కలగాలని ఫాదర్‌ జోసఫ్‌ ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలుపుతూ బెలూన్లను ప్రజల హర్షధ్వానాల మధ్య ముఖ్యఅతిథులు ఎగురవేశారు. అనంతరం అంతర్జాతీయ సువార్తీకుడు ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ గంటెల ప్రజలు, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి యేసుప్రభువు దయచూపాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యేలు అనిల్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలందరికీ యేసుప్రభువు కరుణకటాక్షాలు లభించాలని, సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిలకు దైవ ఆశీస్సులు లభించేలా  క్రైస్తవ సోదరులు ప్రార్థించాలన్నారు. డిసెంబర్‌ 21న జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు అని, ఆయన కోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ గంటెల దైవ వర్తమానం అందించారు. తదుపరి కేక్‌కటింగ్‌ జరిగింది. క్యాండిల్‌ సర్వీస్‌ను నిర్వహించారు. కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ నాయకులు వేలూరు సురేష్‌బాబు, ఊరందూరు సురేంద్రబాబు, రష్యా యువతి బలేరియా, తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు