నగదు కోసం రైతుల తిప్పలు

27 May, 2017 00:00 IST|Sakshi
నగదు కోసం రైతుల తిప్పలు

ఖాతాల్లో డబ్బు ఉన్నతీసుకోలేని ధైన్యం
బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు
ఏక మొత్తంలో ఇవ్వని బ్యాంకర్లు

చొప్పదండి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రోజుల తరబడి పడిగాపులు కాచి అమ్ముకున్న ధాన్యం డబ్బులు ఖాతాల్లో పడుతున్న ఆ ఆనందం ఎంతో సేపు ఉండటం లేదు. బ్యాంకుల్లో తగినంత నగదు నిలువ లేకపోవడంతో రైతులకు బ్యాంకు సిబ్బంది ఏకమొత్తంలో ఇవ్వడం లేదు. నగదు తీసుకుందామని ఆశతో వచ్చిన రైతులకు రూ.ఐదు వేల నుంచి పది వేల వరకు మాత్రమే ఇస్తున్నారు.

ఏటీఎం కేంద్రాల్లో కూడా నగదు పెట్టకపోవడంతో రైతులు బ్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తుండటంతో బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. వరి కోతలకు, కూలీలకు, సరుకు రవాణాకుల కోసం చేసిన రుణాలు చెల్లించాలని రైతులు వాపోతున్నారు.

చొప్పదండి మండలంలో రబీ సీజన్‌లో తొమ్మిది ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు అమ్మకం జరిపారు. ఖాతాలు సమర్పించిన రైతులకు ఇప్పటి వరకు సుమారు రూ.ఎనిమిది కోట్ల నగదు బదిలీ అయింది. సుమారు ఎనిమిది వందలకు పైగా రైతులు ఇప్పుడు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయడం కోసం తిప్పలు పడుతున్నారు. మరో 71 మందికి చెందిన రూ.61 లక్షలు రెండు మూడు రోజుల్లో ఖాతాల్లో జమకానున్నాయి.

ఇక సివిల్‌ సప్‌లై ద్వారా 461 మంది రైతులకు రూ. 4.40 కోట్ల నగదు రైతుల ఖాతాలకు రావాల్సి ఉంది. బ్యాంకు శాఖల్లో తగినంత నగదు నిలువలు లేవని చెబుతుండటంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మెజారిటీ రైతులకు ఆన్‌లైన్‌ ఖాతాల నిర్వహణ తెలియకపోవడంతో బ్యాంకులో ఇచ్చే నగదుపైనే ఆధారపడుతున్నారు.

రోజుకు కొంత నగదు ఇస్తామని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీప్‌ సీజన్‌లో పెట్టుబడులకు డబ్బు అవసరమని, బ్యాంకర్లు ఇవ్వకపోతే బయట అప్పులు చేయాల్సి వస్తొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తీర్చాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు