ముగిసిన జిల్లాస్థాయి జానపద నృత్యపోటీలు

2 Aug, 2016 22:08 IST|Sakshi
తిమ్మాపూర్‌ : ఎల్‌ఎండీ కాలనీలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్‌)లో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు మంగళవారం ముగిశాయి. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన రోల్‌ ప్లే, జానపద నృత్యపోటీలకు జిల్లా నుంచి 12 బృందాలు  పాల్గొన్నట్లు డైట్‌ ఇన్‌చార్జి  ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఇందులో రోల్‌ప్లేలో శంకరపట్నం మండలం కన్నాపూర్‌ పాఠశాల మొదటి, బెజ్జంకి మోడల్‌ స్కూల్‌ ద్వితీయ, వెల్గటూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తృతీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. జానపద నృత్య పోటీల్లో లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాల ప్రథమ, తిమ్మాపూర్‌ కేజీబీవీ ద్వితీయ, తాటిపెల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తృతీయ స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బృందాలు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. డైట్‌లో న్యాయ నిర్ణేతలుగా లెక్చరర్లు మహేశ్వర్‌రెడ్డి, మంజుల, శ్రీనివాసరెడ్డి వ్యవహరించగా.. సమన్వయకర్తగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి మొండయ్య వ్యవహరించారు. విజేతలకు ప్రిన్సిపాల్‌ నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
 
>
మరిన్ని వార్తలు