డీఎన్ఏ పరీక్షకు శాంపిల్స్‌ సేకరణ

7 Sep, 2016 19:37 IST|Sakshi
శవం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న సిబ్బంది
  • రిపోర్ట్ వచ్చిన తర్వాతే శవం అప్పగింత
  • మునిపల్లి: మండలంలోని పిల్లోడి గ్రామంలో వివాదాస్పదంగా మారిన శవాన్ని బయటకు తీశారు. గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ రమణమూర్తి, సిబ్బంది డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి ఆ శవం నుంచి శాంపిల్స్ సేకరించారు. బుధవారం పిల్లోడి గ్రామానికి గాంధీ ఆసుపత్రి నుంచి ప్రొఫెసర్ రమణమూర్తితోపాటు సిబ్బంది, మునిపల్లి తహసీల్దార్ పద్మావతి, బుదేరా ఎస్ఐ కోటేశ్వర్ రావు వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి శాంపిల్స్ సేకరించారు.

    పిల్లోడి గ్రామానికి చెందిన బాలయ్య పిల్లలు, కుటుంబ సభ్యులు, మునిపల్లి గ్రామానికి చెందిన పద్మారావు పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని ఈ సందర్భంగా  ప్రొఫెసర్ రమణమూర్తి తెలిపారు. శవం డీఎన్‌ఏ పరీక్షకు ఎవరిది అనుకూలంగా ఉంటే వారికే శవాన్ని అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు.

    ఇదిలా ఉండగా ఆగస్టు 29న బుదేరా శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతి చెందిన బాలయ్య తన భర్తేనంటూ పిల్లోడికి చెందిన భూమమ్మ బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేసి శవాన్ని గ్రామానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన విషయం విధితమే.

    ఈ ‍క్రమంలో మునిపల్లికి చెందిన పద్మారావు కుటుంబ సభ్యులు స్పందిస్తూ పాతిపెట్టిన శవం తమదంటే తమదంటూ వారు, భూమమ్మ పర్సపరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుదేరా పోలీసులు శవానికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించ తలపెట్టారు. దీని కోసమే డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బయటికి తీసిన శవాన్ని డీఎన్ఏ రిపోర్టు వచ్చేంత వరకు మళ్లీ పాతిపెట్టారు.

    టెన్షన్‌.. టెన్షన్
    పాతి పెట్టిన శవాన్ని బయటకు తీయడానికి డాక్టర్లు వస్తున్నారని తెలియడంతో పిల్లోడి గ్రామస్తులతోపాటు మునిపల్లివాసుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి ఇక్కడే శవం బాలయ్యదా, పద్మారావుదా అని చెబుతారని ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. శాంపిల్స్ సేకరించి గాంధీ ఆసుపత్రిలోనే డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తారని అసలు విషయం తెలియడంతో ఇరుగ్రామాల ప్రజలు, ఇరు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

    పంచె, పాయింట్‌కు తేడా లేదా?
    పిల్లోడి గ్రామానికి చెందిన బాలయ్య పంచె, లుంగీపైనే ఎక్కువగా ఉండెవాడని పిల్లోడి గ్రామస్తులు  తెలిపారు. మునిపల్లికి చెందిన పద్మారావు ఎప్పుడూ పాయింట్‌నే వేసుకునేవాడని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పాయింట్ వేసుకున్నాడా? లేకుంటే పంచె కట్టుకున​ఆడా అని తెలుసుకునే పని పోలీసులకు తిరిగి మొదలైంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే శవాన్ని అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదరా బాదరగా ఫిర్యాదు తీసుకుని శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

మరిన్ని వార్తలు