చిరుధాన్యాల కేంద్రంగా ‘కదిరి’

16 Aug, 2016 23:18 IST|Sakshi
చిరుధాన్యాల కేంద్రంగా ‘కదిరి’

= ‘సాక్షి’తో మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావు
= అమరాపురంలో 10 ఎకరాల్లో వక్క యార్డు ఏర్పాటు


అనంతపురం అగ్రికల్చర్‌ : కదిరిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డును చిరు, నవధాన్యాల కేంద్రంగా మార్చనున్నట్లు మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ... జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలు, నవధాన్యాల పంటలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పండించే చిరు, నవ ధాన్యాల వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉండేలా కదిరిలోని మార్కెట్‌ యార్డ్‌ను మార్పు చేయనున్నట్లు వివరించారు.

ఇందులో భాగంగా కదిరి యార్డ్‌  పరిధిలో చిరుధాన్యాలకు రైతు బంధు  పథకం (ఆర్‌బీపీ) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో 10 ఎకరాల్లో కేవలం వక్క రైతులకు వెసులుబాటు కల్పించేలా కొత్తగా సబ్‌యార్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడా లేని విధంగా ‘అనంత’ వక్క రైతులకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం నడిబొడ్డున నిరుపయోగంగా ఉన్న రైతు బజార్‌లో ఇకపై పూర్తిగా సేంద్రియ పంట ఉత్పత్తులు, కషాయాలు విక్రయాలను ప్రోత్సహించేలా ఆర్గానిక్‌ బజార్‌గా మార్చనున్నట్లు చెప్పారు.  

కక్కలపల్లి సమీపంలో ఉన్న టమోటా మండీల ద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు. మదనపల్లి, చింతామణి, కోలార్‌ తదితర ప్రాంతాల్లో పలికే ధరలకు సంబంధించి డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు, మండీలకు లైసెన్సులు ఉండేలా, అక్కడ సమాచార కేంద్రం, మైకు సిస్టమ్‌ ఏర్పాటుతో పాటు మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాయలసీమ జిల్లాలలో ఏడు టమోటా మార్కెట్‌యార్డుల్లో ఈ–మార్కెటింగ్‌ వ్యవస్థ అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు