సిట్‌ అదుపులో మరో ఇద్దరు | Sakshi
Sakshi News home page

సిట్‌ అదుపులో మరో ఇద్దరు

Published Tue, Aug 16 2016 11:15 PM

situ take the Custody  2members

  • ఇప్పటికే నలుగురిని విచారిస్తున్న అధికారులు
  • పలు కేసులతో నేరుగా సంబంధాలపై ఆరా
  •  కరీంనగర్‌ క్రైం : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్, అనుచరులుగా చెప్పుకుంటూ జిల్లాలో భూ దందాలు చేసిన పలువురిపై కన్నేసిన సిట్‌ ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటోంది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సిట్‌.. తాజాగా కోరుట్లకు చెందిన బీడీ కాంట్రాక్టర్‌ అబ్దుల్‌ రవూఫ్‌ను బెదిరించిన సంఘటనలో కీలంగా వ్యవహరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు రవూఫ్‌ను నయీమ్, వద్దకు తీసుకెళ్లి అతడు చెప్పిన ప్రకారం పెద్ద మెుత్తంలో డబ్బు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. సిట్‌ అధికారులు వీరిని కరీంనగర్‌లోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారని సమాచారం. ఎవరెవరని బెదిరించారు, ఎంతెంత వసూలు చేశారు, ఎక్కడెక్కడ దందాలు చేశారనే వివరాలను కూపీలాగుతున్నట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో సిట్‌ లిస్టు ప్రకారం అందరినీ అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలు తీసుకుని అరెస్టు చూపే అవకాశాలున్నాయని సమాచారం.

    ఇప్పటివరకు నయీమ్, అతడి అనుచరుల దందాలపై జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిని సిట్‌ అధికారులు గతవారం రోజులుగా విచారిస్తున్నారని తెలిసింది. వీరితోపాటు గతంలో కరీంనగర్‌లో ఉండి ప్రస్తుతం సుల్తానాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ మాజీ నక్సల్‌ కోసం కూడా సిట్‌ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించిన అన్ని మార్గాలను మూసివేసిన అధికారులు రెండు రోజుల్లో అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలిసింది. పలు కులసంఘాల నాయకులతో సంబంధాలున్న సదరు వ్యక్తి చిక్కితే కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలో చేసిన భూ దందాలు, సెటిల్‌మెంట్లు, వసూళ్లు, పలువురు బడాబాబుల బాగోతం బయటకు వచ్చే అవకాశం ఉండడంతో అతడి కోసం వేట ముమ్మరం చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement