ఆధునికీకరణకు సమగ్ర ప్రణాళిక

21 Mar, 2017 23:31 IST|Sakshi
ఆధునికీకరణకు సమగ్ర ప్రణాళిక
 ఇరిగేషన్‌ అధికారుల, సమావేశంలో, కలెక్టర్‌ భాస్కర్‌ 
 irrigation officers, meeting, collecter bhaskar
ఏలూరు సిటీ :  జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో డెల్టా ఆధునికీకరణ పనుల ప్రగతిపై ఇరిగేషన్‌ ఏఈలతో ఆయన సమీక్షించారు. జిల్లాలో రూ.76.57 కోట్లతో చేపట్టనున్న 76 పనులను ఏప్రిల్‌ 7 నుంచి మే 12 నాటికల్లా పూర్తి చేయాలన్నారు. ఈనెల 29న కాలువలను మూసివేస్తున్న దృష్ట్యా డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిచేసేందుకు ఇప్పటి నుంచే ఇరిగేషన్‌ అధికారుల బృందం సన్నద్ధం కావాలన్నారు. ఆధునికీకరణ పనులు కేవలం అధికారుల, కాంట్రాక్టర్ల బద్ధకం వల్లే ఆలస్యమయ్యాయని, ఈ సీజన్‌లో పనులు పూర్తి  చేయకపోతే శాఖాపరమైన చర్యలు, ప్రభుత్వపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పోలవరం, చింతలపూడి సేద్యపునీటి ప్రాజెక్టు పనులు తప్ప జిల్లాలో ఇతర అన్ని ఇరిగేషన్‌ పనులు ఈ వేసవి సీజన్‌లో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 
రెండు నెలలు కాలువల వెంట తిరుగుతా 
వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షా సమావేశాలను రానున్న రెండు నెలల్లో నిర్వహించబోనని కాలువల వెంట పర్యటిస్తానని, డెల్టా ఆధునికీకరణ పనులు ప్రగతి తీరును స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్‌ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు చేసే కార్మికులు కూడా మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట మధ్య మాత్రమే భోజన సమయాన్ని కేటాయించుకోవాలని చెప్పారు. గతేడాది ఎక్కడికి వెళ్లినా కార్మికులు భోజనానికి వెళ్లారని చెప్పారని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భోజనం చేస్తున్నారనే మాటే తప్ప ఎక్కడా కార్మికులు కనిపించలేదని ఈసారి అలా జరగడానికి వీల్లేదన్నారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఈఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
ఉద్యాన తోటల అభివృద్ధికి ప్రణాళిక
ఏలూరు సిటీ : జిల్లాలో నూతన ఆలోచనా విధానాలతో ఉద్యాన తోటల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఉద్యాన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యాన పంటల రకాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలన్నారు. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఉద్యాన శాఖ డీడీ ప్రసాద్, ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.  
 
 
మరిన్ని వార్తలు