విద్యాదానానికి నిధులిచ్చేలా ప్రోత్సహించండి

27 Oct, 2016 18:12 IST|Sakshi
విద్యాదానానికి నిధులిచ్చేలా ప్రోత్సహించండి

- టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
అమరావతి: సామాజిక బాధ్యత కింద పలు కార్పొరేట్ సంస్థలు దేవాలయాలు, ఆసుపత్రుల్లో అన్న, ప్రాణ దానాలకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో విద్యాదానానికి నిధులు ఇచ్చేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అన్న దానానికి కార్పస్‌ఫండ్ ప్రతి రోజూ పోగయినట్లుగానే విద్యాదానానికి విద్యా సంస్థల్లో పోగయ్యేలా చూడాలన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రాధమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ఉప కులపతులు, ప్రిన్పిపల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌బాబు, విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదిత్యనాధ్ దాస్, సుమితా దావ్రా, ఉదయలక్ష్మి, సంధ్యారాణి, వల్లీకుమారి, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. విద్యా రంగంలో తాను గతంలో సీఎంగా ఉన్నపుడు చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ప్రస్తుతం దేశ, విదేశాల్లో ఐటీ, సాఫ్ట్‌వేర్, రంగాల్లో ఇంజనీర్లు తమ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని విజ్ఞాన, విద్యా కేంద్రంగా తయారు చేయటమే లక్ష్యంగా అధికారులు, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పాఠశాలలు పరిశుభ్రమైన ప్రాంతాలుగా తయారు కావాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రతి నెల మొదటి శనివారం యోగా డే, ప్రతి మూడో శనివారం ఇన్నోవేషన్ డే, నాలుగో శనివారం సామాజిక కార్యక్రమాల్లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొనేలా శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్య, పారా మెడికల్, ఫార్మసీ విద్యార్ధులతో మల్టీ స్టూడెంట్ డిసిప్లీన్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ బృందాలు సంచార వైద్య శాలల్లో గ్రామాల్లో పర్యటించి అనారోగ్య సమస్యలకు కారణాలు విశ్లేషించాలని తెలిపారు. గ్రామీణుల ఆరోగ్యంపై వైద్య, పంట సంజీవిని, జల సంరక్షణపై ఇంజనీరింగ్ విద్యార్ధులు అధ్యయనం చేయాలన్నారు. ప్రతి విద్యార్ధిలో నాయకత్వ లక్షణాలు పెంపొందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. వివిధ సబ్జెక్టులు, హాజరు, వ్యాయామ విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించి విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, రాజమండ్రి తదితర నగరాలకు తీసుకెళ్లి వారిలో చదువుపట్ల ఆసక్తి మరింత పెరిగేలా చూడాలని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో ఆరుగురు అధ్యాపకులతో ప్రిన్సిపల్ పర్యవేక్షణలో ఇన్నోవేషన్‌సెంటర్ ఏర్పాటు చేయాలని, అన్ని కళాశాలల్లో డిజిటల్ లిటరసీ క్లబ్స్ ఏర్పాటు చేయాని వివరించారు. ప్రతి జిల్లాకు ఒకటి లేదా రెండు ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు. వివిధ కళాశాలల నుంచి పేటెంట్ ఇండియాకు 48 దరఖాస్తులు వెళ్లటం పట్ల సీఎం అభినందించారు. ప్రభుత్వ కళాశాలల నుంచి 13 పీహెచ్‌డీలు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్‌పై విశ్వవిద్యాలయ స్థాయిలో ఉత్తమ కార్యచరణపై పరిశోధనలు జరగాలన్నారు.

మరిన్ని వార్తలు