అన్నప్రసాదంపై ఆటలు

19 Jun, 2016 01:03 IST|Sakshi
అన్నప్రసాదంపై ఆటలు

రూ.50 లక్షలతో తాత్కాలిక అన్నదానం షెడ్డు నిర్మాణం
మరో చోట పర్మినెంట్ బిల్డింగ్
ప్రస్తుతం రోజుకు రూ.12 వేల అద్దెతో సత్రం లీజుకు..
వృథా ఖర్చులపై భక్తుల ఆగ్రహం
 

సాక్షి, విజయవాడ: దుర్గగుడి అధికారులు తీసుకునే నిర్ణయాలు ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా. నష్టం చేకూర్చేలా, భక్తులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వంట చేసుకునేందుకు అన్నదాన భవనం నిర్మించారు. ప్రస్తుతం దేవాలయంలో అభివృద్ధి పేరుతో ఈ భవనాన్ని తొలగించారు. ప్రస్తుత అద్దె భవనంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దేవస్థానానికి వచ్చిన భక్తులేనా ?
దేవస్థానంలో రోజుకు 5 వేల మందికి భోజనం పెట్టాలనే నిబంధన ఉంది. కొండపై నుంచి దిగువకు మార్చిన తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకంటే వన్‌టౌన్‌లోని చిరు వ్యాపారస్తులే ఎక్కువగా తింటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అమ్మ వారి దర్శనమైన తరువాత పక్కనే భోజనశాల ఉంటే అక్కడకు వెళతారు. ఇప్పుడు కొండ దిగువకు మార్చడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ షెడ్లు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకే అన్నదానం ప్రారంభమవుతోంది. ఇది కాళేశ్వరరావు మార్కెట్లో, కెనాల్ రోడ్డులో పనిచేసే కూలీలకు వరంగా మారింది.

కొండపైన అన్నదానం జరిగేటప్పుడు సాధారాణ రోజుల్లో 3500 మంది వచ్చేవారు. శుక్ర, ఆదివారాల్లో 4200 మంది భోజనం చేసేవారు. ప్రస్తుతం సత్రంలో   రోజుకు 4200 మంది, శుక్ర, ఆదివారాల్లో 4500 మంది భక్తులు భోజనాలు చేస్తున్నారు. అదనంగా తినే భక్తులంతా అమ్మ దర్శనం అయిన తరువాత భోజనశాలకు వస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా అమ్మ సొమ్ము దుర్వినియోగం కాదా?  అని కొందరు భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం
అన్నదానం పర్మినెంట్ బిల్డింగ్ నిర్మించాక..తాత్కాలిక షెడ్డును భక్తుల విశ్రాంతి మందిరంగా ఉపయోగిస్తాం. బయటి భక్తులు అన్నదానానికి రావడాన్ని అరికట్టేందుకు త్వరలోనే బార్ కోడింగ్, ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం. - చంద్రశేఖర్ ఆజాద్, దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
 
 
శృంగేరీ సత్రంలో తాత్కాలిక అన్నదానం
అర్జున వీధిలోని శృంగేరి వడ్లమన్నాటి వారి సత్రంలో తాత్కాలిక అన్నదాన కార్యక్రమం ఆరో తేదీ నుంచి ప్రారంభించారు. దసరా, భవానీ దీక్షల సమయంలో ఈ శృంగేరి సత్రాన్ని అద్దెకు తీసుకుని అన్నదానం చేస్తుంటారు. ప్రస్తుతం రోజుకు రూ.15 వేలు చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. శృంగేరి సత్రానికి దగ్గరలోనే ఇరిగేషన్‌కు చెందిన పాత భవన సముదాయం స్థలాన్ని దేవస్థానం తీసుకుంది. ఇక్కడ పాత భవనాలను తొలగించి నెల రోజుల్లోగా తాత్కాలిక షెడ్డు వేసి అన్నదానం కార్యాక్రమాన్ని అక్కడకు మార్చాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దీని కోసం సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు వేశారు.

పుష్కరాల తరువాత షెడ్లను తొలగించి దాని స్థానంలో పర్మినెంట్ బిల్డింగ్ నిర్మిస్తారు. అద్దె భవనం, తాత్కాలిక షెడ్ల కోసం సుమారు అర కోటి ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పుష్కరాల తరువాత పక్కా భవనాలు నిర్మించి అప్పుడే కిందకు అన్నదానం మార్చితే వచ్చే నష్టం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అమ్మవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసి ఇలా తాత్కాలిక పనులకు కేటాయించడం సరికాదనే వాదన వినిపిస్తున్నాయి. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వీరంతా షెడ్డుల్లోనే కూర్చుని భోజనాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ షెడ్డుల్లోనైనా సరైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు