రెవెన్యూలో అవినీతి కంపు

1 Aug, 2016 22:46 IST|Sakshi
కందుగు వీఆర్‌ఓ, వీఆర్‌ఏను విచారిస్తున్న డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌
  • చేతులు తడిపితేనే పని 
  • కలకలం రేపుతున్న వరుస ఏసీబీ దాడులు 
  • హుజూరాబాద్‌ :  రెవెన్యూశాఖలో అవినీతి కంపు కొడుతోంది. కొందరు అధికారులు ఆమ్యామ్యాల కోసం బరితెగిస్తున్నారు. చేతులు తడపనిదే రెవెన్యూశాఖలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. వేతనాలు ఊహించని స్థాయిలో ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏ పని కావాలన్నా చేతులు తడిపితేనే చేస్తామని, లేకపోతే దిక్కున్న చోట చెప్పుకోండని బహిరంగంగానే అంటున్నారు. అధికారులు మితిమీరిన వ్యవహారంతో వేగలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌తోపాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదవడం, వరుస ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి.  

    చేతులు తడపాల్సిందే !
    రెవెన్యూశాఖలో ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ చెప్పినంత ఇవ్వకపోతే నెలలపాటు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితులు చేసిన ఫిర్యాదును సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే తిరిగి అప్పగించడం వంటి ఘటనలు చూస్తుంటే అవినీతిని ఉన్నతాధిరులే ప్రోత్సహిస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 
    హుజూరాబాద్‌ మండలం కందుగులకు చెందిన మండ సదయ్య తన 20 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈక్రమంలో వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్‌ఏ రవీందర్‌ రూ.8 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సదయ్య సదరు ఇద్దరు అధికారులతో వాగ్వాదానికి దిగాడు.  అయినా సదరు అధికారులు పని చేయలేదు. దీంతో సదయ్య మీసేవలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. వీఆర్వో, వీఆర్‌ఏలు డబ్బులు అడుగుతున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా.. రిజిస్టర్‌లో సదయ్య పేరును నమోదు చేయలేదు. ఈక్రమంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ తీరుపై  సంజాయిషీ రాయించుకున్నారంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. సదయ్య తహసీల్దార్‌కు చేసిన ఫిర్యాదుపత్రం కూడా వీఆర్వో రాజ్‌కుమార్‌కు చేరింది. దీంతో డబ్బుల కోసం సదయ్యపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో చేసేదేమిలేక ఏసీబీని ఆశ్రయించాడు. రూ.4 వేలు లంచం ఇస్తుండగా వల పన్ని వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్‌ఏ రవీందర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 
    కలకలం రేపుతున్న ఏసీబీ ఘటనలు 
    హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఏడాదిలో తొమ్మిది మందిపై కేసులు నమోదు కాగా, ఇటీవల వరుసగా ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి.  
    – సెప్టెంబర్‌ 17, 2015లో కమలాపూర్‌ మండలం గుండేడు వీఆర్వో గుండా రమేశ్‌బాబు పహణీలో తప్పుగా ఉన్న పేర్ల సవరణ, పట్టాపాసు పుస్తకంలో భూమి వివరాల నమోదుకు రూ.13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 
    – జూలై 21, 2016న  జమ్మికుంట తహసీల్దార్‌గా పనిచేసిన మంకెన రజనీ, వీఆర్వో శ్రీనివాస్‌ పహణీలో పేరు మార్పు, ఓ రైతు తండ్రి భూమిని కుమారుడి పేరిట మార్చేందుకు డబ్బులు కోరడం, ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి భారీగా లంచాలు తీసుకున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో కరీంనగర్‌లో అరెస్ట్‌ చేశారు. 
    – జూలై 26, 2016న హుజూరాబాద్‌కు చెందిన చాయాదేవికి సంబంధించిన వ్యవసాయ భూమిని మరొకరిపై పేరు మార్పిడీ చేశారని పెద్దపాపయ్యపల్లి వీఆర్వో వేణు, మరికొందరిపై బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో విచారణలో తప్పు చేసినట్లు రుజువవడంతో వీఆర్వో వేణుతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 
    – జూలై 30, 2016న హుజూరాబాద్‌ మండలంలోని కందుగులకు చెందిన మండ సదయ్య 20 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్‌ఏ రవీందర్‌ రూ. 8వేలు లంచం డిమాండ్‌ చేశారు. అధికారుల తీరుతో విసుగుచెందిన సదయ్య ఏసీబీని ఆశ్రయించాడు. చివరకు రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 
    అక్రమాస్తులపై ఏసీబీ ఆరా 
    ఆదాయానికి మించి కొందరు ఉద్యోగులు ఆస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్రమార్కుల ఆస్తులపై దృష్టిసారించినట్లు తెలిసింది. పలుశాఖల్లో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యోగులు సైతం రూ.కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీరి ఆస్తులు, వాటి వివరాలను రాబట్టే దిశగా ఏసీబీ అధికారులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అవినీతికి  మారుపేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. 
మరిన్ని వార్తలు