‘ఉపాధి’ కొక్కులు..!

7 Aug, 2016 23:22 IST|Sakshi
ఇవ్వకపోయినా కూలీలు చెల్లించినట్లు ఖాతా పుస్తకంలో నమోదు చేసిన బీపీఎం
– పనులకు వెళ్లకపోయినా మస్టర్లు సృష్టి
– వేతనాల పంపిణీలోనూ చేతివాటం
– చిన్నతుంబళంలో వెలుగు చూసిన అక్రమాలు
 
 
పెద్దకడబూరు/మంత్రాలయం :
ఉపాధి పనుల్లో అక్రమాలు ఇవి. దొంగ మస్టర్లు సృష్టించి పేదల ధనాన్ని దండుకున్న అవినీతి బాగోతమిది. పేదల శ్రమను వీరు దోపిడీ చేశారు. తినమెరిగిన మేటీలు.. స్వార్థం మరిగిన బీపీఎం.. లాలూచీ అధికారులు..కుమ్మక్కై పాతిక లక్షల రూపాయలు కాజేశారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం ఉపాధి పనుల్లో  సాగిన దందాపై ప్రత్యేక కథనం.. 
పనుల నిర్వహణ ఇలా..
గ్రామంలో ఈ ఏడాది పనులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.2.50 కోట్ల లక్ష్యంగా పెట్టింది. అందులో ఇప్పటి వరకు రూ.93 లక్షల మేర పనులు చేశారు. ఐదు నెలల కాలంలో కేవలం రెండు పర్యాయాలు వేతనాలు చెల్లించారు. ఇటీవల రూ.42 లక్షలు నిధులు డ్రా చేశారు. ఇంకా రూ.51 లక్షల వరకు నిధులు డ్రా కావాల్సి ఉంది. గ్రామంలో మొత్తం 2,700 జాబ్‌కార్డులు ఉన్నాయి. రోజుకు 800–900 వరకు కూలీలు పనులకు హాజరవుతూ వచ్చారు. ఇప్పటివరకు 42 వేల పనిదినాలు కల్పించారు.  
మస్టర్లలో మాయాజాలం :
అవినీతి రుచి మెరిగిన మేటీలు మస్టర్లలో మాయాజాలం చేశారు. పనులకు రాకపోయినా వచ్చినట్లు, ఊళ్లో లేకున్నా పనులు చేసినట్లు మస్టర్లు సష్టించారు. గ్రామంలో అందరూ పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఎక్కించారు. గ్రామంలో బాబా (131772204006011667–01), జిలాన్‌ (131772204006011644–01), లక్ష్మి (131772204006011593–02), నరసింహ (131772204006010163–01), నారాయణమ్మ (131772204006010163–02) వీళ్లంతా ఏ ఒక్క రోజు పనికి వెళ్లలేదు. అయినా వాళ్ల పేర్లుపై వేతనాలు మంజూరు చేశారు. బాబాకు రూ.5,617, జిలాన్‌కు రూ.2,019, లక్ష్మికు రూ.2,234, నరసింహకు రూ.4,958, నారాయణమ్మకు రూ.4,958 వేతనం జమ చేశారు. నరసింహ, నారాయణమ్మ దంపతులు బతుకు తెరువు కోసం ముంబాయికి వలస వెళ్లారు. వారూ ఇక్కడ పనుల్లో పాల్గొన్నట్లు నమోదు చేశారు. దాదాపు 120 మందికిపైగా పనులకు వెళ్లలేకున్నా వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేగాక పనులకు వెళ్లిన వారి వేతనాల్లోనూ స్వాహాకార్యం చేశారు. ఉశేని(131772204006010782–03)కు రూ.9,772 గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010078–01) రూ.11,830 రావాల్సి ఉండగా రూ.1900, నల్లన్నకు (131772204006010717–02) రూ.14,484గానూ రూ.2 వేలు, పరిశప్పకు (131772204006010096–01) రూ.9,928కి గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010207–04)కు రూ.10,920కి గానూ రూ.340 చేతికి చ్చారు. మిగతా నిధులు ముట్టినట్లు ఖాతా పుస్తకంలో రాసి ముద్ర సైతం వేశారు. ఇలా మోసపోయిన కూలీలు 500 మందికిపైనే ఉన్నట్లు అంచనా. 
 
దందా సాగిన తీరు..
పనులు చేయిస్తున్న మేటీలు, పోస్ట్‌మన్‌ ఏకమై దందాకు పాల్పడ్డారు. మేటీలందరూ ఒక్కటై దొంగ మస్టర్లను రెడీ చేశారు. నిధులు రాగానే రాబట్టుకునేందుకు వ్యూహం పన్నారు. పనులకు రాని వ్యక్తులు వేలి ముద్రల కోసం కొంత డ్రామా కట్టారు. ఎక్కువ కాలం పనులకు రాకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని బుకాయించారు. పనులకు రాకున్నా వారం పనులకు ఉచితంగా డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. వేలి ముద్రలు వేసి డబ్బు తీసుకుపోవాలని పేస్లిప్‌లు చేతుల్లో పెట్టారు. పాపం అమాయక జనం నిజమేనేమో..అని పాట్‌మిషన్లలో వేలి ముద్రలు సేకరించారు. ఒక్కసారి కాకుండా ప్రతి వారానికో ముద్ర చొప్పున ఒకేసారి నొక్కించారు. పాస్‌ పుస్తకాల్లో ఇష్టమెచ్చిన లెక్కలు రాసేశారు. అంతేగాక పనులకు వచ్చిన కూలీలకు వారం వారం పేస్లిప్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం అలా సాగలేదు. ఒక్కటీ రెండు పేస్లిప్‌లు ఇవ్వడం మిగతా స్లిప్‌లు మేటీలతోనే ఉంచుకున్నారు. పనులకు వచ్చిన కూలీలకు వారం కూలితో సరిపెట్టారు. మిగతా కూలీలు సైతం ఇచ్చేసినట్లు ఖాతా పుస్తకాల్లో నమోదు చేశారు. 
 
రూ.25 లక్షల స్వాహా :
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కూలీల సొమ్మును కాజేశారు. రూ.93 లక్షల పనుల్లో రూ.25 లక్షలు స్వాహా చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకు మించే ఉందని గ్రామస్తులు ఆరోపణ. ఆరు నెలల దోపిడీనే ఇంత ఉంటే. గతంలో భారీ మొత్తంలో నిధులు దండుకున్నారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా వెనక ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మండలాధికారులు ఉన్నట్లు సమాచారం. నిధులు కాజేసే కథనంతా బీపీఎం షాషావలీ ద్వారా నడిపిసున్నట్లు స్పష్టమవుతోంది. అవినీతిని నిలదీస్తే మేటీలు మీరు పనికి  రాకున్నా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం. తీసుకుపోండి ఎక్కువ మాట్లాడొద్దని ఎదురు తిరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వండని అడిగితే ఇంకోసారి పనుల్లో పెట్టుకోమంటూ భయపెడుతున్నారని వాపోయారు. 
 
>
మరిన్ని వార్తలు