వామ్మో.. రెడ్‌క్రాస్‌!

5 May, 2017 23:44 IST|Sakshi
వామ్మో.. రెడ్‌క్రాస్‌!

- అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు
– బ్లడ్‌బ్యాంక్‌లో కనీస ప్రమాణాలు పాటించని వైనం
– రికార్డుల నిర్వహణా అస్తవ్యస్తమే
– ఏపీ శాక్స్‌కు సమగ్ర నివేదిక


అనంతపురం మెడికల్‌ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించాల్సిన రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ లోపాల పుట్టగా మారింది. మూడు నెలల నుంచి నివేదికలు రాకపోవడంతో ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీలో కొనసాగుతున్న రాజకీయ విభేదాల కారణంగా బ్లండ్‌బ్యాంక్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు ఏపీ శాక్స్‌కు సమగ్ర నివేదిక పంపారు. తనిఖీల్లో భాగంగా అక్కడికి వెళ్లిన డాక్టర్‌ అనిల్‌కుమార్‌.. ముందుగా మూడు నెలల నుంచి నివేదికలు పంపని వైనంపై సిబ్బందిని ప్రశ్నించారు.

ఇప్పటికే రెండుసార్లు మెయిల్‌ చేశామని, ఒకసారి ఫోన్‌ చేసి చెప్పినా ఎందుకు పంపలేదని నిలదీశారు. అక్కడ 24 గంటలు విధుల్లో ఉండాల్సిన మెడికల్‌ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ లేకపోవడంతో ఎక్కడికెళ్లారని ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ రోస్టర్‌ కూడా లేని పరిస్థితి ఉన్నట్లు గ్రహించారు. మొత్తం ల్యాబ్‌టెక్నీషియన్లతోనే నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఎంత మేరకు బ్లడ్‌ సేకరిస్తున్నారు.. ఇతరులకు ఇవ్వడానికి వీల్లేకుండా ఉన్న రక్తం ప్యాకెట్లు ఎన్ని.. ఎన్ని ప్యాకెట్లు గడువు ముగిశాయన్న వివరాలు కూడా లేకపోవడంతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు రాత్రి వేళ కూడా బ్లడ్‌ బ్యాంక్‌ను నిర్వహించాల్సి ఉన్నా ఇక్కడా పరిస్థితి లేదు. సిబ్బందిని అడిగితే ఊరికి దూరంగా ఉంది.. ఇక్కడెలా ఉండాలని సమాధానం రావడంతో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా రక్తం ఇవ్వడానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన డోనర్‌ గదిలో ఆక్సిజన్‌ లేకపోవడం, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోకపోవడం, పరిసరాలన్నీ అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోజూ నాలుగుసార్లు బ్లడ్‌ ప్యాకెట్ల టెంపరేచర్‌ పరిశీలించాల్సి ఉన్నా అలాంటిదేమీ ఇక్కడ జరగడం లేదని గ్రహించి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మొత్తంగా బ్లండ్‌ బ్యాంక్‌లో పర్యవేక్షణ లేదన్న విషయాన్ని తెలుసుకుని ఇక్కడి సౌకర్యాల లేమి, అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ శాక్స్‌కు నివేదిక పంపారు. రెడ్‌క్రాస్‌లో ఉన్న పరిస్థితిని ఎయిడ్స్‌ నియంత్రణ మండలి జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ విభాగాన్ని చూసిన అధికారులు అస్సలు దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైనట్లు తెలుస్తోంది. ఈ బ్లడ్‌బ్యాంక్‌కు రక్తం సేకరించడానికి అవసరమయ్యే బ్యాగ్స్, టెస్టింగ్‌ సామగ్రి ఏపీ శాక్స్‌ నుంచే సమకూరుస్తారు. అయితే వీటి లెక్క కూడా అక్కడ లేదని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు