Philippines: మీడియాకు ముప్పుగా మారిన దేశమేది?

7 Nov, 2023 10:47 IST|Sakshi

ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులతో పాటు, కొందరు జర్నలిస్టులు కూడా మృతిచెందారు. అయితే  ఇలాంటి పరిస్థితులు లేనప్పటికీ ఫిలిప్పీన్స్‌లో పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల జాబితాలోకి మరో పేరు చేరింది. తాజాగా రేడియో బ్రాడ్‌కాస్టర్  ఒకరు స్టూడియోలో తుపాకీ కాల్పులకు బలయ్యారు. 

గడచిన 17 నెలల్లో ఫిలిప్పీన్స్‌లో నలుగురు మీడియా సిబ్బంది హత్యకు గురయ్యారు. కాలాంబా మునిసిపాలిటీ ప్రతినిధి కెప్టెన్ డియోర్ రాగోనియా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 57 ఏళ్ల రేడియో బ్రాడ్‌కాస్టర్ జువాన్ జుమలోన్‌కు చెందిన స్టూడియోలోకి చొరబడిన సాయుధ దుండగుడు అతని తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జుమాలోన్‌ మృతి చెందాడు. ‘డీజే జానీ వాకర్’గా పేరొందిన జుమాలోన్.. మిండానావోలోని తన నివాసంలోని స్టూడియోలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

కాల్పులు జరిపిన అనంతరం ఆగంతకుడు పరారయ్యాడు. ఈ ఘటన స్టూడియోలోని సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ హత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఈ కేసులో నేరస్తులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై దాడులను సహించబోమని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారి చర్యలు తీసుకుంటామని మార్కోస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ ద్వారా తెలియజేశారు.

నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్(ఎన్‌యుజేపీ) తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జూన్‌లో ఫెర్డినాండ్ మార్కోస్ అధికారం చేపట్టిన తర్వాత ఫిలిప్పీన్స్‌లో నలుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఫిలిప్పీన్స్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘ప్లీజ్‌.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు