జమ్మికుంటలో ఇద్దరు చిన్నారులకు డెంగీ?

27 Aug, 2016 18:58 IST|Sakshi
జమ్మికుంటలో ఇద్దరు చిన్నారులకు డెంగీ?
  • అపరిశుభ్రంగా పట్టణం
  • వ్యాప్తి చెందుతున్న దోమలు
  • జమ్మికుంట : పట్టణంలోని ఐదో వార్డుకు చెందిన రాజేశం (మండల సర్వేయర్‌) పిల్లలు అఖిల్, నేహకు డెంగీ సోకినట్లు ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధరించారు. వీరు నాలుగురోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు వారికి డెంగీ ప్రబలినట్లు వైద్యులు పేర్కొన్నారని రాజేశం తెలిపారు. పట్టణంలోని ఏ వార్డు చూసినా.. అపరిశుభ్రత రాజ్యమేలుతోందని కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు. మురుగుకాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. నగర పంచాయతీ పరిధిలోని 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డుల్లో మురుగుకాలువలు అపరిశుభ్రంగా మారాయి. చెత్తాచెదారం పేరుకపోవడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వ్యాప్తి చెంది రోగాలు సోకుతున్నాయి. కూరగాయల మార్కెట్‌ ఏరియా, అంబేద్కర్‌ కాలనీ, దుర్గకాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ, పాత వ్యవసాయ మార్కెట్‌ రోడ్డు, పీఏసీఎస్‌ ఏరియా, వర్తక సంఘం ఏరియాల్లో మురుగు కాలువల్లో చెత్తచెదారం నిండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారే అధికంగా రోగాల పాలవుతున్నట్లు ఆసుపత్రుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. రోగాల నియంత్రణకు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
     
     
     
>
మరిన్ని వార్తలు