రుద్రారంలో బాలికకు డెంగీ

9 Sep, 2016 18:17 IST|Sakshi
రుద్రారంలో బాలికకు డెంగీ
  • హైదరాబాద్‌లో చికిత్స
  • గ్రామంలో మరికొందరికి విషజ్వరాలు

  • చిన్నశంకరంపేట: డెంగీ వ్యాధితో బాలిక అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి వినోద్‌ కూతురు ధనలక్ష్మి చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. వారం క్రితం విషజ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో సికింద్రాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ సోకినట్లు నిర్ధారించారు.

    దీంతో అక్కడ చికిత్సలు అందించారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో గ్రామానికి చేరుకున్నారు. బాధిత బాలిక తండ్రి వినోద్‌ మాట్లాడుతూ బాలికకు జ్వరం ఉందని ఆస్పత్రికి తీసుకుపోతే హైదరాబాద్‌ తీసుకుపొమ్మన్నారన్నారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి సోకినట్లు నిర్ధారించారని తెలిపారు. సుమారు రూ. లక్ష వైద్యం కోసం ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్యం ఖర్చులను అందించి ఆదుకోవాలని కోరారు.

    కాగా గ్రామంలో అనేక మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వైద్య అధికారులు గ్రామానికి వచ్చి వైద్య పరీక్షలు చేయాలని కోరారు. ఇదే విషయం చిన్నశంకరంపేట మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సవిత దృష్టికి తీసుకుపోగా బాలికకు డెంగీ వ్యాధి వచ్చిన విషయం తమ దృష్టికి  వచ్చిందన్నారు. గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి వైద్య పరీక్షలు చేయిస్తానన్నారు.

మరిన్ని వార్తలు