కేసీఆర్‌కు సిపాయిగా ఉంటా : డీఎస్

9 Jul, 2016 05:02 IST|Sakshi
కేసీఆర్‌కు సిపాయిగా ఉంటా : డీఎస్

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ను జీవితంలో మరచిపోలేనని, ఆయనకు రుణపడి ఉంటానని సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఈ సహకారానికి జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషిగా సిపాయిగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు ఫౌండేషన్లకు పరిమితమయ్యాయని, అదే రెండేళ్ల సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం లో అనేకచోట్ల ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని డీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన భగీరథ పథకాలతోపా టు,  ప్రాజెక్టుల నిర్మాణాలను చకచకా చేపడుతుందన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడమే ఏకైక లక్ష్యంతో సీఎం చక్కటి విజన్‌తో ముందుకు సాగుతున్నారన్నారు. సీమాంధ్ర నాయకులతోపాటు తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నాయకులే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మెతక వైఖరి అవలంభించారని, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తామిద్దరం తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆమె అనుకూలంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణమే తమ కర్తవ్యమన్నారు.

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వి.జి.గౌడ్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత  పాల్గొన్నారు.

 ఘనస్వాగతం: రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన డీఎస్‌కు జిల్లాలోని ఇందల్‌వాయి టోల్‌గేట్ వద్గ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ‘కేసీఆర్‌కు షుక్రియా ర్యాలీ’  పేరుతో నిజామాబాద్ చేరుకున్నారు.

మరిన్ని వార్తలు