అధ్వానంగా అంతర్గత రోడ్లు

9 Jun, 2017 23:15 IST|Sakshi
అధ్వానంగా అంతర్గత రోడ్లు

చినుకుపడితే చిత్తడవుతున్న రహదారులు
పెరుగుతున్న పందుల బెడద
ఇబ్బందుల్లో దిలావర్‌పూర్‌ వాసులు

దిలావర్‌పూర్‌: దిలావర్‌పూర్‌ గ్రామంపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా గ్రామస్తులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నికల సమయంలో అదిచేస్తాం..ఇదిచేస్తాం.. అన్న నేతలు తీరా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రధానంగా గ్రామంలో మేజర్‌సమస్యలు రాజ్యమేలుతుండడంతో అనేక వార్డుల్లో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

ముఖ్యంగా డ్రెయినేజీ అంతర్గత రోడ్లు, పందుల బెడదతో ప్రజలు తీవ్ర తంటాలు పడుతున్నా పట్టించుకునే నా«థుడే కరువయ్యాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన దిలావర్‌పూర్‌లో రోజురోజుకి పెరుగుతున్న జనాభా అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల జాడ అగుపడని మూలంగా 14వార్డుల్లో ప్రజలు తీవ్ర సమస్యల బారిన పడుతున్నారు. దాదాపుగా 7వేల పైచిలుకు జనాభా4200 మంది ఓటర్లు ఉన్న దిలావర్‌పూర్‌లో ప్రధానంగా పారిశుద్ద్య సమస్యలు తరచూ ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా గ్రామంలో గత కొన్ని సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైనేజీలే అనేక వార్డుల్లో ఇప్పటికీ అవే ఉండడంతో పెరిగిన జనాభాఅవసరాలకు  అవి సరిపడక పోవడంతో నిత్యం డ్రైనేజీల గుండా మురికినీరు ప్రవహిస్తునే ఉంది. ఒకటవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారడంతో జనావాసాల నడుమ పెద్దపెద్ద గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. దీంతో దోమల బెడద అధికంగా కావడంతో రాత్రయితే చాలు తాము దోమలతో సావాసం చేస్తూ రోగాల బారిన పడుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్త చేస్తున్నారు.

గతంలో గ్రామంలో మలేరియా,డెంగ్యూ ప్రబలడంతో స్వయంగా జిల్లా కలెక్టర్‌ తో పాటు ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జనావాసాల నడుమ ఎలాంటి మురునీటి గుంటలు ఉండకూడదన్న ఉన్నతాధికారుల మాటలు నీటిమూటలే అయ్యాయి. అనేక వార్డుల్లో వర్షంకురిస్తే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు దెబ్బతిని మట్టిరోడ్లను తలపిపిస్తున్నాయి.

పందుల బెడదపైస్పందించని అధికారులు...
గ్రామంలో అనేక రోజుల నుండి పందుల బెడద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసమస్యపై గ్రామకమిటీతోపాటు పంచాయతీ పాలక వర్గాలు జిల్లా ఉన్నతాదికారులకు ఫిర్యాదు చేయగా గ్రామానికి వచ్చిన ఉన్నతాధికారులు సైతం సమస్యల పట్ల చేతులెత్తేయండంతో నేడు గ్రామంలో ఏవీధిలో చూసిన పందులు తారసపడుతునే ఉన్నాయి. గ్రామస్థుల పిర్యాదులు సైతం అధికారులు బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే గ్రామంలో రాజ్యమేలుతున్న సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు చేపడతాం....
మండలంలోని గ్రామంలో పలు వార్డుల్లో డ్రైనేజీలు, íసీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపాం, అలాగే గ్రామంలోని డ్రైనేజీల్లో   వర్షాకాలం నేపథ్యంలో పూడిక తీయించి శుభ్రపరుస్తాం. జనావాసాల నడుమ ఉన్న మురుగునీటి గుంటలను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
– కె.శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీ కార్యనిర్వహణ అధికారి, దిలావర్‌పూర్‌

మరిన్ని వార్తలు