విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం

27 Sep, 2016 17:02 IST|Sakshi
విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం
* డిస్కమ్‌ సీఎండీ హెచ్‌వై దొర ఆదేశం
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
 
గుంటూరు (నగరంపాలెం): జిల్లాలో భారీవర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సంస్ధ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌  హెచ్‌ వై దొర సంస్థ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. వర్షాల ధాటికి జిల్లాలో ఇప్పటివరకు 1750 విద్యుత్‌ స్తంభాలు కూలిపోగా, 387 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, 2180 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించటానికి అధికారులు, సిబ్బంది నిర్విరామంగా పనిచేయాలని సూచించారు. బలమైన గాలి, వర్షం వున్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్‌ లైన్లకు దూరంగా వుండాలని, ఎక్కడైనా విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపడడం జరిగితే తక్షణమే సమీపంలోని విద్యుత్‌ శాఖ అధికారులకు గానీ టోల్‌ఫ్రీ నంబరు 1800 425 155333 లేదా 1912 నంబరుకు గానీ ఫోన్‌ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
 
రెండు రోజుల్లో అన్ని సర్వీసులకు విద్యుత్‌ సరఫరా..
–ఎస్‌ఈ జయభారతరావు
భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రెండురోజుల్లో అన్ని సర్వీసులకు  పూర్తిస్థాయిలో  విద్యుత్‌ సరఫరా అందిస్తామని జిల్లా విద్యుత్‌ శాఖ పర్యవేక్షక ఇంజినీరు బి.జయభారతరావు సీఎండీకి తెలిపారు.  విద్యుత్‌ సరఫరాలో ఎక్కువ శాతం అంతరాయం ఏర్పడిన సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడు, రెంటపాళ్ళ, క్రోసూరు మండలంలోని పీసపాడు, రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం, గణపవరం, అంచుపాలెం గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామన్నారు. రాజుపాలెం, సత్తెనపల్లిలలో అదనంగా ఇద్దరు డీఈలు, సుమారు 200 మంది సిబ్బందితో, తగిన సామగ్రిని అందుబాటులో ఉంచుకొని  యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామన్నారు. గత నాలుగు రోజులుగా రాజుపాలెంలోనే ఉండి పనులను స్వయంగాపర్యవేక్షిస్తూ వేగవంతం చేయడానికి  సిబ్బందికి సహాయపడుతున్నామని వివరించారు.  సీఎండీతో పాటు సీఈ కె.రాజబాపయ్య, డీఈఈలు ఆంజనేయులు, భాస్కర్‌బాబు, పిచ్చయ్య, వసంతరావు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది ఉన్నారు.
మరిన్ని వార్తలు