శివార్పణం!

5 Nov, 2016 16:09 IST|Sakshi
శివార్పణం!
  • 20 ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతం 
  • రూ.కోట్ల ఆస్తులు ఉన్నా నైవేద్యానికీ కరువు
  • దీనస్థితిలో చీరాల ప్రాంత చారిత్రక ఆలయాలు
  • భక్తుల విరాళాలతోనే ధూప దీపాల నిర్వహణ
  • భూసేకరణకు ఆదేశించి మాట తప్పిన ప్రభుత్వం
  •  
    ఆలయ భూములకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన దేవుడి మాన్యం అన్యాక్రాంతమైంది. దశాబ్దాలుగా భూములు ఆక్రమణ చెరలో ఉన్నా.. క్రయవిక్రయాలతో భారీ మెుత్తంలో నగదు చేతులు మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భూ సేకరణ ద్వారా దేవాదాయశాఖకు నిధులు సమకూర్చుతామని 20 ఏళ్ల కిందట హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ దాని ఊసెత్తడం లేదు. దీంతో శతాబ్దాల చరిత్రగల ఆలయాలు ధూప దీప నైవేద్యాలకు నోచుకోక కునారిల్లుతున్నాయి. ఉత్సవాల నిర్వహణకు సైతం భక్తులు, దాతల సహకారంతో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. 
    చీరాల : 
    చీరాల ప్రాంతంలో అగస్త్య మహాముని క్రీ.శ. 1365 సంవత్సరంలో పేరాల శివాలయం, పేరాల మదనగోపాల స్వామి దేవాలయాలను ప్రతిష్టించారు. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరడంతో తామర చెరువు (ప్రస్తుతం ఉన్న పేరాల శివాలయాన్ని నిర్మించి దానికి పునుగు రామలింగేశ్వరస్వామి దేవాలయంగా) 1795లో తిరిగి పునఃప్రతిష్టించారు. పేరాల మదనగోపాలస్వామి దేవస్థానానికి 12 ఎకరాలు, పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయానికి 8.32 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, మాన్యంగా ఇచ్చారు. ఈ భూములన్నీ చీరాల పట్టణ ప్రాంతంలోనివే కావడం విశేషం. 
     
    ఆక్రమిత భూముల్లో వెలసిన పక్కా ఇళ్లు..
    పట్టణ ప్రాంతంలోని దండుబాట, సెయింటాన్స్‌ స్కూలు సమీపం, రెడ్డిపాలెం, హరిప్రసాద్‌నగర్, జవహర్‌నగర్‌ ప్రాంతాల్లో సర్వే నంబర్‌ 16/1లో పేరాల శివాలయానికి 0.44 ఎకరాలు, 16/2లో 2.49 ఎకరాలు, 7/2లో 0.80 ఎకరాలు, 263లో 0.7. ఎకరాలు, ఆలయ పూజారుల అర్చకులు జీతభత్యాల కింద కుందేరు సమీపంలో 8.32 ఎకరాలు మాగాణి భూములు ఉన్నాయి. అలాగే పేరాల ఆలయం అధీనంలో సర్వే నంబర్‌ 14/1లో 4.3 ఎకరాలు, 255/7లో 1.67 ఎకరాలు, 11/2లో 1.34 ఎకరాలు భూములు ఉన్నాయి. దండుబాట, సెయింటాన్స్‌ స్కూలు సమీపంలో, హరిప్రసాద్‌నగర్, జవహర్‌నగర్‌ ప్రాంతాల్లో సుమారు 500 పక్కా ఇళ్లు నిర్మించి నివాసం ఉంటున్నారు.
     
    ఎకరం రూ.3 కోట్లు..
    ఈ భూములన్నీ ఎన్నో ఏళ్ల నుంచి ఆక్రమణల్లోనే ఉన్నాయి. మొదట్లోనే విషయం తెలిసి కూడా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఎకరం రూ.3 కోట్లకు చేరగా, శెంటు భూమి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పలుకుతోంది. భూముల ధరలు పెరగడంతో ఆక్రమణదారుల్లో చాలామంది భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దీంతో కోట్లాది రూపాయల నగదు చేతులు మారుతున్నాయి. 
     
    దూపదీపానికి దాతల సహకారమే..
    చారిత్రక ప్రాశస్త్యం గల చీరాల ప్రాంతంలోని పేరాల శివాలయం, మదన గోపాలస్వామి దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు, ముఖ్య పండుగలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించాలన్నా దాతలు, భక్తుల ఆర్థిక చేయూతతోనే నిర్వహిస్తున్నారు. వారి సాయంతోనే ధూపదీపాలు, స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో మంగళవాయిద్యాల నిర్వహణ భారం మోయలేక ప్రజలను, దాతల సహాయాన్ని తీసుకుంటున్నారు. కోట్లాది రూపాయల భూములు ఉన్నా దూప దీపాలకు దాతలను ఆశ్రయించడంతో అర్చకులు ఇబ్బందులు పడుతున్నారు.
     
    మాటతప్పిన సర్కారు...
    ఆక్రమిత ఆలయ భూముల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని, ఆక్రమణలో ఉన్న దేవాదాయ భూములు కొనుగోలు చేసి ఆ నిధులు దేవాదాయశాఖకు చెల్లిస్తామంటూ 1996లో నాటి ప్రభుత్వం భూసేకరణకు ఆదేశించింది. నేటికీ అది అమలు కాలేదు. ఆ తర్వాత పాలకులు ఎందరు మారినా భూసేకరణ చట్టాన్ని అమలుచేయలేదు. ఎప్పుడు క్రమబద్ధీకరిస్తారో.. ఎప్పుడు తొలగిస్తారో.. అని నివాసితులు సైతం ఆందోళనలు చెందున్నారు.  
మరిన్ని వార్తలు