బాధితులకు భరోసా ఏదీ?

26 Sep, 2016 20:30 IST|Sakshi
పాఠశాలలో పునరావాసం పొందుతున్న బాధితులు

పునరావాసాల నుంచి తరలివెళ్లాలని అధికారుల ఆదేశం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మెదక్ మున్సిపాలిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోగా, శిథిలావస్థకు చేరుకున్న బాధితులను ఇదివరకే స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నారు. సుమారు 40 కుటుంబాల వరకు పునరావాసం పొందారు. బాధితులకు రెండు రోజులుగా ఆహార సదుపాయలు ఏర్పాటు చేశారు.

సోమవారం వర్షం లేకపోవడంతో ఇక పాఠశాలలు వదిలి వెళ్లాలని అధికారులు బాధితులను ఆదేశించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరు, మున్నీరవుతున్నారు. వర్షాలకు పూరిళ్లు, పెంకుటిళ్లు మెత్తబడి కూలిపోయే ప్రమాదం ఉంది. తిరిగి ఇళ్లలోకి వెళితే మాకు చావు కాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సోమవారం ఆకస్మాతుగా ఇళ్లకు వెళ్లమని చెప్పడంతో తిండికోసం చిన్నా, పెద్దలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు.

ఉన్నఫలంగా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. స్థానికంగా ఉన్న వారు మొక్కుబడిగా ఆహారం అందించారని వాపోయారు.  ఇది ఇప్పటి వరకే గాని తమ అసలు సమస్య పరిష్కరించేది ఎవరని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే గోల్కొండ బస్తీలో ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం చెందారని ఆ సంఘట ఇంకా మా కళ్లముందే మెదులుతుందన్నారు. అధికారులు పునరావాసాలను ఖాళీ చేసి వెళ్లాలని చెప్పడంతో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఇళ్లు దెబ్బతిన్న బాధితుల వివరాలు
పట్టణంలోని 12 వార్డులో గోల్కొండ బస్తీలో సుమారు 40 ఇళ్లు వివిధ స్థాయిలోని ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్తీకి చెందిన నర్స్‌పల్లి మహేష్, బుర్రెనొల్ల పోచమ్మ, ఫతేనగర్‌ సుజాత, బొడెల్లిగారి శ్యామల, గవ్వలపల్లి అంజయ్య, వినోద, చదల దుర్గయ్య, భీమయ్య, ఘనపురం నారాయణ, భవాని, జోగొల్ల అనురాధ, కిష్టయ్య, చోటబీ, సుగుణ, మల్లమ్మలతోపాటు ఇళ్లు కొన్ని దెబ్బతినగా, మరికొన్ని కూలిపోయే ప్రమాదంలో ఉన్నట్లు బాధితులు తెలిపారు.  

ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు: బొడెల్లిగారి శ్యామల
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.  శిథిలమైన ఇళ్లు, ఉరుస్తున్న ఇళ్లలో నుంచి ఉన్నఫలంగా వచ్చి పాఠశాలలో తలదాచుకున్నాం. ఇప్పుడు అధికారులు ఇళ్లకు వెళ్లమంటున్నారు. కాని పాత ఇళ్లు కావడంతో అవి తడిసి ముద్దగా మారాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. అధికారులు వెళ్లిపొమ్మనడంతో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు.

ప్రభుత్వం ఆదుకోవాలి: వినోద
ఉన్నఫలంగా పునరావాసాలను వదిలిపొమ్మంటున్న అధికారులు అసలు సమస్య పట్టించుకోవడం లేదు. రేపో మాపో కూలిపోయే ఇళ్లలోకి ఎలా వెళ్లాలి. ఎక్కడ ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నారు. మా గోస ఎవరికి పట్టదా? ప్రభుత్వం స్పందించి మేము ఉండేందుకు తగిన వసతి కల్పించి ఆదుకోవాలి. అలాగే కూలిన ఇళ్లకు   డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు చేయాలి.

బాధితులకు న్యాయం చేయాలి: అయితారం నర్సింలు, కౌన్సిలర్‌
పట్టణంలోని 12 వార్డులో అధికారులు పర్యటించి కూలిన ఇళ్లను పరిశీలించాలి. వార్డులోని నిరుపేదలైన ఇళ్లు కూలిన బాధితులకు, పూర్తిగా శిథిలమైన వాటికి న్యాయం చేసి ఆదుకోవాలి.

మరిన్ని వార్తలు