స్నేహ హస్తం చాస్తే.. ఉగ్రదాడులా?

27 Sep, 2016 07:12 IST|Sakshi
స్నేహ హస్తం చాస్తే.. ఉగ్రదాడులా?

పాక్ తీరును ఐరాసలో ఎండగట్టిన సుష్మాస్వరాజ్

- బలూచిస్తాన్ ప్రజలపై పాశవిక అణచివేత
- ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే కొన్ని దేశాల చిరునామా
- ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం
 
 ఐక్యరాజ్యసమితి:
పాకిస్తాన్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తే.. దానికి బదులుగా భారత్‌కు ఉగ్రదాడులు లభించాయని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తూర్పారబట్టింది. హక్కుల ఉల్లంఘనలపై ఇతరులను నిందించే వాళ్లు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాక్‌కు హితవుపలికింది. బలూచిస్తాన్‌లో పాక్ అత్యంత పాశవికమైన అణచివేతను సాగిస్తోందంటూ.. ఐరాస సర్వసభ్య సభ సమావేశంలో తొలిసారి ఆ దేశాన్ని భారత్ అభిశంసించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది. సమితి 71వ సర్వసభ్య సమావేశంలో సోమవారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. వారం కిందట ఇదే వేదిక నుంచి పాక్ ప్రధాని షరీఫ్ భారత్‌పై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ‘కొన్ని దేశాలున్నాయి.

ఐరాస ప్రకటించిన ఉగ్రవాదులు అక్కడ స్వేచ్ఛగా విహరిస్తుంటారు. విద్వేష ప్రబోధాలను ఇస్తూ ఉంటారు.. వారికి చట్టం, శిక్షలు వర్తించవు. అటువంటి దేశాలు అవి ఆశ్రయం ఇచ్చిన ఉగ్రవాదులు ఎంత నేరస్తులో అంతే నేరస్త దేశాలవుతాయి. అలాంటి దేశాలకు ప్రపంచ దేశాల కమిటీలో చోటు ఉండరాదు’ అంటూ పాక్‌పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెడుతూ.. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జామత్ ఉద్-దావా అధినేతసయీద్ విషయాన్ని పేరు చెప్పకుండా సుష్మా ప్రస్తావించారు. ‘మన మధ్య కొన్ని దేశాలు ఉన్నాయి. అవి ఇంకా ఉగ్రవాద భాషను మాట్లాడుతుంటాయి, ఉగ్రవాదాన్ని పోషిస్తుంటాయి, విస్తరిస్తుంటాయి, ఎగుమతి చేస్తుంటాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటమే వాటి చిరునామాగా మారింది. అటువంటి దేశాలను మనం గుర్తించితీరాలి. వాటిని ఏకాకులను చేయాలి’ అని అన్నారు.

 కశ్మీర్‌పై కలలు మానండి... చర్చలకు భారత్ తమకు ఆమోదనీయం కాని ముందస్తు షరతులు విధించిందన్న పాక్ వాదనను తిప్పికొడుతూ.. షరతులు కాకుండా స్నేహం ప్రాతిపదికన పాక్‌తో సమస్యలను పరిష్కరించటం కోసం ముందడుగు వేసినందుకుభారత్‌కు పఠాన్‌కోట్, ఉడీ దాడులు ప్రతిఫలంగా దక్కాయని సుష్మా పేర్కొన్నారు. ఇటువంటి దాడుల ద్వారా కశ్మీర్‌ను పొందగలమన్న కలను పాకిస్తాన్ విడనాడాలని ఆమె సూచించారు. వారి ప్రణాళికలు సఫలం కావని.. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అది అలాగే ఉండిపోతుందని ఉద్ఘాటించారు.

 పాక్ ప్రమేయానికి సజీవ సాక్ష్యం...
 ‘మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేముందు మేం  షరతులు పెట్టామా? హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు కోసం నేను ఇస్లామాబాద్ వెళ్లి, సమగ్ర ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించడానికి అంగీకరించినపుడు షరతులు పెట్టామా? మోదీ కాబూల్ నుండి లాహోర్‌కు ప్రయాణించినపుడు మేం ఏమైనా ముందస్తు షరతులు విధించామా?’ అని ప్రశ్నించారు. గత కొన్నేళ్లలో పాకిస్తాన్‌తో అనూహ్యమైన స్నేహపూర్వక విధానాన్ని భారత్ ప్రయత్నించిందని.. కానీ దీనికి ప్రతిఫలంగా భారత్‌కు పఠాన్‌కోట్, ఉడీలలో ఉగ్రదాడులు లభించాయని పేర్కొన్నారు. ‘బహదూర్ అలీ మా కస్టడీలో ఉన్న ఉగ్రవాది. సీమాంతర ఉగ్రవాదంలో పాక్ ప్రమేయానికి అతడి వాంగ్మూలం సజీవ సాక్ష్యం’ అని తెలిపారు. ఉగ్రవాదమనేది మానవాళిపైనే నేరమని, దీన్ని ఎదుర్కోడానికి దేశాలు సమర్థ వ్యూహాన్ని రచించాలన్నారు.  ఐరాసలో సుష్మ సమర్థంగా, ప్రసంగించారని మోదీ అభినందించారు.
 
 ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది...
 జమ్మూకశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ పాక్ ప్రధాని ఆరోపణలను సుష్మ తిప్పికొడుతూ.. ‘మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఇతరులపై ఆరోపణలు చేసేవారు.. బలూచిస్తాన్ సహా తమ సొంత దేశంలో తాము ఎంతటి దురాగతాలకు పాల్పడుతున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. బలూచ్ ప్రజలపై జరుగుతున్న క్రూరత్వం రాజ్య అణచివేతలో అత్యంత దారుణ రూపం’ అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు