ప్రతి ఇంటికి జియోట్యాగ్‌

22 Jun, 2017 01:37 IST|Sakshi
ప్రతి ఇంటికి జియోట్యాగ్‌

మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు  

మెదక్‌మున్సిపాలిటీ: ఆస్తిపన్ను మదింపునకు సంబంధించి ప్రతి ఇంటికి(అసెస్‌మెంట్‌) జియోట్యాగ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భువన్‌ యాప్‌ను ప్రవేశపెట్టిందని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు. బుధవారం మెదక్‌ పట్టణంలోని ఫతేనగర్‌ వీధిలో జియోట్యాగింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా మెదక్‌ పట్టణంలో జియోట్యాగ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పన్నులు వసూలు చేసే బిల్‌ కలెక్టర్లు ముందుగా ఫోన్‌లో భువన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు రిజిస్టర్‌ కావాలన్నారు. దీంతో అతని పరిధిలో గల అసిస్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్‌లోకి చేరతాయన్నారు. అనంతరం బిల్‌ కలెక్టర్‌ ప్రతి అసిస్‌మెంట్‌ను పరిశీలించి, భవనాల ఫొటో తీసుకొని వాటిని జియోట్యాగ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఆర్‌ఐ ఆయా వివరాల్లో తప్పులు సరిచేయడంతో పాటు వాటిని కంప్యూర్‌లో నిక్షిప్తం చేస్తారన్నారు. గతంలో జీఐఎస్‌ సర్వే ద్వారా ప్రతి ఇంటికి కొలతలు తీసుకున్నామని, జియోట్యాగింగ్‌ ద్వారా అందులో ఏమైనా అనుమానాలుంటే సరిచేసుకోవచ్చన్నారు. మెదక్‌ పట్టణంలో 9,470 అసిస్‌మెంట్లు ఉన్నాయని మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. అందులో ఇప్పటి వరకు 450 అసిస్‌మెంట్‌లకు జియోట్యాగ్‌ పూర్తిచేశామన్నారు. జూలై 15వ తేదీలోగా జియోట్యాగ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. భువన్‌యాప్‌లో సేకరించిన సమాచారాన్ని ప్రజలు ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ ఆర్‌ఐ రమేశ్, బిల్‌ కలెక్టర్‌ శివ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు