ఫేస్‌బుక్‌తో గాలం

5 Feb, 2016 09:06 IST|Sakshi
నిందితుడు రాజ్‌కుమార్

నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్
బాధితుల ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు


కర్నూలు: ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలకు వల వేసి.. ఉద్యోగమిస్తానంటూ మాయమాటలతో లాడ్జికి రప్పించి.. నగ్నచిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ బంగారు ఆభరణాలు లాక్కుంటున్న ఘరానా నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన అవుజ రాజ్‌కుమార్ అలియాస్ తేజర్షి డిగ్రీ వరకు చదువుకొని.. వెలుగోడులో కొంతకాలం పాటు ఆర్‌ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత దొర్నిపాడు గ్రామంలో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.

ఈ క్రమంలో ఏడు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో మంచం పట్టాడు. కాలక్షేపం కోసం ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తన బట్టతలకు విగ్ పెట్టుకుని ఉన్న ఫొటోను అందులో ఉంచి.. అమ్మాయిలను ఆకర్షించే విధంగా కొటేషన్లను అప్‌లోడ్ చేసేవాడు. వీటికి ఆకర్షితులై కామెంట్ చేసిన అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నమ్మించి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు.

తన ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి లాడ్జిలకు పిలిపించి వారిని లోబరుచుకునేవాడు. నగ్న ఫొటోలు కూడా తీసి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కునేవాడు. ఈవిధంగా మోసపోయిన సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన మరో వివాహిత చేసిన ఫిర్యాదు మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీసులు గతంలో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కూడా ఫేస్‌బుక్‌నే ప్రయోగించి నిందితున్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పది తులాల బంగారు ఆభరణాలు, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని గురువారం ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు.
 

మరిన్ని వార్తలు